Chandrabose: దాన్ని దొంగతనం చేశాను.. రూ. 40 లక్షలు కట్టాను
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:23 PM
: టాలీవుడ్ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Chandrabose: టాలీవుడ్ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన పాటలు ఎంతోమంది మనుషులను మార్చాయి. ఆస్కార్ అవార్డును అందుకున్న చంద్రబోస్ ఒక పాడ్ క్యాస్ట్ లో తాను చేసిన ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా రూ. 40 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిపాడు.
ఒక పాడ్ క్యాస్ట్ లో చంద్రబోస్ మాట్లాడుతూ.. ' నా సొంత ఊరిలో గ్రంధాలయం కట్టించాను. దాని విలువ రూ. 40 లక్షలు. ఆ గ్రంధాలయాన్నీ కట్టడానికి నేను చేసిన దొంగతనమే కారణం. మా ఊర్లో ఒక గ్రంధాలయం ఉండేది. నాకు పుస్తకాలు అంటే మహా ఇష్టం. చదివేముందు వాటి వాసన చూస్తాను. భలే ఉంటుంది. అలా రోజు లైబ్రరీకి వెళ్లి అన్ని పుస్తకాలను చదివేవాడిని. అలా ఒకరోజు లైబ్రరీలో త్రిభాషా నిఘంటువు అని ఒక పుస్తకాన్ని చూసాను. ఎంతో అందంగా.. మిల మిల మెరిసిపోతూ కనిపించింది. అందులో ఒక పదానికి మూడు భాషల్లో ఏమని పిలవాలో రాసి ఉంటుంది. ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది.
త్రిభాషా నిఘంటువు అక్కడ ఉండడం కన్నా నా దగ్గర ఉండాలి అని.. దాన్ని దొంగిలించి ఇంటికి తెచ్చేశాను. ఆ పుస్తకం నేను కాలేజ్ చదివేటప్పుడు నాతోనే ఉంది. రచయితగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాతోనే ఉంది. ఇప్పటికీ నాతోనే ఉంది. కానీ, దాన్ని చూసిన ప్రతిసారి నేను దొంగతనం చేశాను అనే పాపభారం పెరుగుతూ వచ్చింది. ఆస్కార్ వచ్చాక నేను, నా భార్య మా ఊరు వెళ్లాం. అక్కడ నేను చదువుకున్న గ్రంధాలయం పెచ్చులు ఊడిపోయి కనిపించింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. బుక్ దొంగిలించిన దానికి ఇదే ప్రాయశ్చిత్తం అనుకోని 6 నెలల్లో కొత్త గ్రంధాలయాన్ని కట్టించాను. ఆ బుక్ విలువ అప్పుడు రూ. 40లే కానీ ఇప్పుడు దాని విలువ రో . 40 లక్షలు ' అని చెప్పుకొచ్చాడు.