చదలవాడ శ్రీనివాసరావు : చిన్న నిర్మాతలే పరిశ్రమకు పెద్ద దిక్కు

ABN , Publish Date - Mar 15 , 2026 | 08:35 PM

'ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం.. ఈరోజున పరిశ్రమలో ఎక్కువ సినిమాలు తీసేది చిన్న నిర్మాతలే. కానీ వారికి ఇక్కడ మనుగడ కరువైంది. 

'ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం.. ఈరోజున పరిశ్రమలో ఎక్కువ సినిమాలు తీసేది చిన్న నిర్మాతలే. కానీ వారికి ఇక్కడ మనుగడ కరువైంది.   తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి. వారికి మంచి జరిగేలా చూడాలి' అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (chadalavada srinivasarao) అన్నారు. ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (Film critics association) సారధ్యంలో  ఆదివారం సోమాజిగూడా ప్రెస్‌ క్లబ్‌లో  జరిగిన 'మీట్‌ ది ప్రెస్‌' కార్యక్రమంలో  చదలవాడ శ్రీనివాసరావు  అతిధిగా హాజరయ్యారు.


ఆయన మాట్లాడుతూ  'చిన్న సినిమాలకు ప్రభుత్వ సపోర్ట్‌ కన్నా ఫిలిం ఇండస్ట్రీలో  ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సపోర్ట్ ఎంతో  అవసరం. చిన్న సినిమా అనేది ఎదుగుదలకు ఒక మొక్క లాంటిది. ఎంత పెద్ద హిట్‌ అవ్వాలన్నాకూడా చెట్టుకి విత్తనం ఎంత అవసరమో చిన్న సినిమా కూడా ఇండస్ట్రీకి అంతే అవసరం. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌దేవరకొండ నుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమా నుంచే పైకి వచ్చారు. దాసరి నారాయణరావు నుంచి   రాజమౌళి వరకు అందరు చిన్న సినిమాలతో వచ్చినవారే. అందుకే  చిన్న సినిమాలను బ్రతికిస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ప్రభుత్వం కంటే కూడా అవగాహనతో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. గతంలో 20, 30 ఏళ్ల క్రితం చంద్రబాబు హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. ఒక సినిమాతో సక్సెస్‌ వస్తుందని ఎప్పుడూ నిర్మాత నమ్మకూడదు. అనుభవంతో ఉంటే ఏ నిర్మాత అయినా కూడా మంచి సినిమా తీయగలరు. చాలామంది ఆసక్తితో వచ్చి చిన్న సినిమాలు తీస్తున్నారు. కానీ బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు..  థియేటర్లలో రిలీజ్‌ చేయడం చాలా కష్టమయి పోయింది. ఒకప్పుడు థియేటర్‌కు జనం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు  సినిమాల సంఖ్యా పెరగడం వల్ల ఆడియన్స్‌ తగ్గిపోయారు. చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో బాలేదన్న మాట నిజం. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.   

srinu.jpeg
ప్రణాళిక.. క్రమశిక్షణ ముఖ్యం.. 

చిన్న సినిమాకు నిర్వచనం  చెప్పాలంటే.. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఒకప్పుడు కరెక్టుగా తీస్తే 30 రోజులు సరిపోయేది. ప్రతి ఒక్కరం ఒక దగ్గరే ఉండి క్వాలిటీగా పని  చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు రోజులు మారాయి. పాటలు ఎలా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. పాత పద్ధతిలో క్వాలిటీ సాంగ్స్‌ వచ్చేవి.  సరిగ్గా షూటింగ్‌ సమయాల్ని ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది. లేదంటే కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరిగిపోతుంది.  అది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు.  నాకు తెలిసి మూడు నుంచి ఐదు కోట్లలో చిన్న సినిమా తీయొచ్చు. గతంలో అడవి రాముడు చిత్రం 26 రోజుల్లో తీశారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన చిత్రాలను తీసుకుంటే నాలుగు చిత్రాల్లో ఒకటి చాలా కాస్ట్‌లీ చిత్రం కానీ తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే హిట్‌ అయింది.  

నిర్మాతలకు వారసత్వం లేకుండా పోయింది.. 

ఉషాకిరణ్‌మూవీస్‌, ఎల్‌. వి. ప్రసాద్‌, రామానాయుడు గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. మంచి మంచి సంస్థలు మనుషులు ఉన్నా లేకున్నా వారసత్వాలు రన్‌ అవుతున్నాయి. కానీ వారసత్వపు ప్రొడ్యూసర్స్‌ రన్‌ అవ్వడం లేదు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. గతంలో 90పర్సెంట్‌ వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. క్రమశిక్షణ లేకపోవడం, ప్రొడక్షన్‌ వాల్యూస్‌ మన చేతిలో లేకపోవడం, చిన్న సినిమాల పరిస్థితి ఇలా కావడానికి కారణాలు ఇవే.  అలాగే చిత్ర పరిశ్రమలో 24 శాఖలు ఉన్నాయి. ఏ అసోసియేషన్‌ కూడా దాంట్లో నుంచి పక్కకు వెళ్ళి వేరే కుంపటి పెట్టుకోలేదు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నుంచి కొంత మంది నిర్మాతలు గిల్డ్‌  పెట్టుకున్నారు. గిల్డ్‌ ప్రయోజనాలకి, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రయోజనాలకి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇండస్ట్రీలో సమస్యలు అనగానే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలే తప్ప చిన్న సినిమాలను అడ్రస్‌ చేయడానికి లేకుండా పోయింది.    

critics.jpeg
ప్రతి సందులో మినీ థియేటర్ ఉండాలి.. 

గతంలో మినీ థియేటర్లు కట్టాలని ప్లాన్ చేశాను. ఛాంబర్‌ ద్వారా మినీ థియేటర్స్‌ పాంప్లేట్‌ ఇస్తే 100  తీసుకువెళ్లారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం లేదు. చిన్న థియేటర్ల లైసెన్స్‌ 50 నుంచి 200 వరకు ప్రతీ కమ్యూనిటీలో, ప్రతీ సందులో, ప్రతీ సంస్థలో చిన్న సినిమాల వల్ల వెరైటీ కథలు బయటకు వస్తాయి. బడ్జెట్‌లో తీస్తారు. కాబట్టి మినీ థియేటర్స్‌ వస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.

 

ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్  అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రాసిన 'శూన్యం నుండి శిఖరాగ్రం వరకు' పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా శ్రీనివాసరావు చేతుల మీదగా చిరు సత్కారం చేశారు.

ప్రభు మాట్లాడుతూ 'గత కొన్నేళ్ళుగా ఉన్న క్రిటిక్స్  అసోసియేషన్‌ ద్వారా మన ఉనికిని మనం చాటుకోవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను మనం చేపట్టాలి. నా సొంత మనుషుల సమక్షంలో గద్దర్ అవార్డు ప్రకటించినందుకు గాను నన్ను సన్మానించడం చాలా ఆనందంగా  ఉంది' అని అన్నారు.

   
ప్రెసిడెంట్ జెవి బత్తులప్రసాద్‌గారు మాట్లాడుతూ... 'చిన్న నిర్మాతల పరిస్థితి మనగడకే ప్రమాదకరంగా మారింది. తిరిగి చిన్న సినిమా బ్రతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి.. చిన్న నిర్మాతల పరిరక్షణ కమిటీ అని పెట్టి కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆయనకు 5వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమా తీయగల సత్తా ఉంది. కానీ దానివల్ల కొంతమంది మాత్రమే పని చేస్తారని చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ సదుపాయాలు సమకూరాలంటే చిన్నసినిమాలు బ్రతకాలి. కాబట్టి ఆయన ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు' అన్నారు. 

Updated Date - Mar 15 , 2026 | 09:40 PM