వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాకూ తప్పలేదు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:53 PM
సెన్సార్ వారి అభ్యంతరాల కారణంగా మరో సినిమా పేరు మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ తెరకెక్కించిన 'సరస్వతి' అనే సినిమా పేరు ముందు కొత్తగా ఎస్ అక్షరం వచ్చి చేరింది.
ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ (Sharath Kumar) కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sharath Kumar) సైతం మంచి నటి. అంతేకాదు ఎంటర్ పెన్యూర్ కూడా. అయితే తాజాగా ఆమె నిర్మాతగా, దర్శకురాలిగా మారింది. ఆమె తన సోదరి పూజతో కలిసి నిర్మించిన 'సరస్వతి' (Saraswathi) మూవీ ఈ నెల 6న జనం ముందుకు వస్తోంది. వరలక్ష్మీతో పాటు ప్రియమణి (Priyamani), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రాధిక (Radhaka), సప్తగిరి, కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా పేరుపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయినట్టు తెలిపిన పోస్టర్‌లో 'సరస్వతి' అనే టైటిల్ ముందు ఎస్. అనే అక్షరాన్ని కొత్తగా చేర్చారు. సెన్సార్ సభ్యుల అభిమతం మేరకు ఈ అక్షరం జత అయ్యిందని తెలుస్తోంది.

ఎందుకంటే... గత యేడాది కూడా మలయాళ చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki Vs State of Kerala) సినిమా విషయంలోనూ అదే జరిగింది. జానకి అనే పేరు ఈ సినిమాలో పదే పదే రావడం ఆమె గల అమ్మాయి అత్యాచారానికి గురైనట్టుగా సినిమాలో చూపించడంతో సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ సినిమా పేరును 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చారు. ఇప్పుడు కూడా సరస్వతి అనే పేరుకు ముందు ఇన్షియల్ పెట్టమని సెన్సార్ సభ్యులు కోరినందు వల్లే 'సరస్వతి' మూవీ పేరు కాస్తా 'ఎస్. సరస్వతి' గా మారిపోయిందని పిస్తోంది.
జనవరి నుండి సెన్సార్ అభ్యంతరం కారణంగా పేరు మారిన సినిమాల్లో ఇది నాలుగోది. జనవరిలో 'వనవీర', ఫిబ్రవరిలో 'నవాబ్ కేఫ్', 'హే బలవంత్' అలానే పేరు మార్చుకుని జనం ముందుకు వచ్చాయి.