సెన్సార్ వారి లీలలు ఇంతింత కాదయా!

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:07 PM

సెన్సార్ అధికారులు మరో సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 20న విడుదల కావాల్సిన సుహాస్ సినిమా 'హే భగవాన్'పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇప్పుడా సినిమా పేరును 'హే బలవంత్' అని మార్చారు.

Title Change

ఒక్కోసారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారుల లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని సినిమాలకు ఎందుకు యు/ఎ సర్టిఫికెట్ ఇస్తారో తెలియదు, మరి కొన్ని చిత్రాలకు ఎందుకు 'ఎ' సర్టిఫికెట్ ఇస్తారో తెలియదు. కొన్ని సినిమాల పేర్లు ఎందుకు మార్చమంటారో కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు చాలా జరుగుతున్నాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay_ నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడకముందే పలు చిత్రాల విషయంలో సెన్సార్ వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం విశేషం. అయితే ఇందులో చాలా వరకూ ఆ యా సినిమాల పేర్ల వల్లే సమస్య ఉత్పన్నం అయ్యింది. డిసెంబర్ నెలాఖరులో రావాల్సిన 'వానర' (Vanara) సినిమా పేరుపై సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేకర్స్ తమ సినిమా పేరును 'వనవీర' (Vanaveera) అని మార్చుకున్నారు. పేరు మార్పు కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 26న రావాల్సి ఈ సినిమా జనవరి 1న విడుదలైంది. అయితే ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడలేదు. 'వనవీర' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు మెప్పించలేకపోయింది.


ఇటీవల ఇలాంటి సమస్యే మరో సినిమాకూ ఎదురైంది. 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly) సినిమా పేరు విషయంలో సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ యూత్ ఆ టర్మ్ ను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో దాని మార్చమని నిర్మాతలను సెన్సార్ అధికారులు కోరినట్టు తెలిసింది. 'కపుల్ ఫ్రెండ్లీ' బదులుగా 'ఫ్రెండ్లీ కపుల్' అని మార్చమని సూచించినా నిర్మాత అంగీకరించలేదని, దాంతో సెన్సార్ అధికారులు మూవీకి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారని స్వయంగా నిర్మాతే మీడియాకు చెప్పారు. సినిమా కథకు 'కపుల్ ఫ్రెండ్లీ' అనే టైటిల్ కు సంబంధం లేదు, అయినా ట్రెండీగా ఉంటుందని మేకర్స్ అదే టైటిల్ కు ఫిక్స్ అయ్యారని అంటున్నారు.


ఇదిలా ఉంటే శివ కందుకూరి నటించిన 'చాయ్ వాలా' (Chai Wala) సినిమా టైటిల్ మీద కూడా అభ్యంతరం వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీని 'చాయ్ వాలా' అని సంభోదిస్తుంటారు. దాంతో ఆ పేరును మార్చమని ముంబై సెన్సార్ అధికారులు కోరారని, అందువల్ల తమ సినిమా పేరును 'చాయ్ వాలా' నుండి 'నవాబ్ కేఫ్' (Nawab Cafe) గా మార్చుకున్నామని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా సుహాస్ మూవీ 'హే భగవాన్' (Hey Bhagawan) కూ టైటిల్ ప్రతిబంధకంగా మారింది. ఈ సినిమా పేరును మార్చాల్సిందిగా సెన్సార్ అధికారులు సూచించడంతో ఇప్పుడు 'హే బలవంత్' (Hey Balawanth) అని మార్చారు. చిత్రం ఏమంటే... ఇలా పేరు మారిన 'నవాబ్ కేఫ్‌, హే బలవంత్' రెండూ కూడా ఈ నెల 20నే జనం ముందుకు రాబోతున్నాయి. మరి కొత్త పేర్లతో వస్తున్న ఈ యువ కథానాయకుల చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Updated Date - Feb 16 , 2026 | 01:07 PM