దేశ‌మంతా ఒక‌లా.. ఇక్క‌డ మ‌రోలా! తెలుగు నిర్మాత‌ల‌కు.. సినిమా చూపిస్తున్న సెన్సార్!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:14 AM

హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో బ్యానర్ ఐడీల జారీ ఆలస్యం టాలీవుడ్ నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. ఇతర రాష్ట్రాల్లో 24 గంటల్లో ఐడీలు వస్తుండగా, ఇక్కడ వారాలు, నెలలు పడుతున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Censor Board

సినిమా అనగానే అందమైన లోకేషన్లు, అబ్బురమని పించే సెట్టింగులు, చెవులకు ఇంపైన సంగీతం, కథలో మలుపులు, పాత్రధారుల నటనా కౌశలం.. ఇలాంటివే గుర్తుకొస్తాయి. ఇదంతా బయటకు కనిపించేది. కానీ, దాని వెనుక నిర్మాత (Tollywood Producers) పడే కష్టం మాత్రం చాలామందికి తెలియదు. నిర్మాతలు అప్పులు తీసుకొచ్చి మరీ సినిమాలను నిర్మిస్తుంటారు. సినిమా విడుదలలో జాప్యం జరిగితే అప్పుల మీద వడ్డీలు పెరిగిపోయి పరిస్థితి కుదేలవుతుంది. ఇటువంటి ఆర్థికపరమైన రిస్క్‌ల‌కు తాజాగా సెన్సార్ నిబంధనలు కూడా తోడయ్యాయని నిర్మాతలు వాపోతున్నారు.

పెరిగిపోతున్న సినీ నిర్మాణ సంస్థలను నియంత్రించటానికి 2017లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ప్రతి నిర్మాత.. తమ సంస్థ (బ్యానర్) పేరును ప్రభుత్వం వద్ద నమోదు చేయించాలి. ప్రభుత్వం ఆ సంస్థకు ఒక ఐడీ (గుర్తింపు) (Censor ID) ఇస్తుంది. ఇది ఉంటేనే ఆ సంస్థ/నిర్మాత నిర్మించిన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ లభిస్తుంది. ఐడీ జారీ ప్రక్రియలో జాప్యం జరిగితే సినిమా విడుదల కూడా ఆలస్యమవుతుంది. ఇంత కీలకమైన ఐడీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు.

ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య

సెన్సార్బోర్డుకు దేశవ్యాప్తంగా 10 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. వీటికి రీజినల్ ఆఫీసర్ (ఆర్ఓ) (Regional Officer) లు అధిపతులుగా ఉంటారు. అయితే గతేడాది ఫిబ్రవరి నుంచి హైదరాబాద్‌లోని సెన్సార్ (Hyderabad Censor Office) కార్యాలయానికి పూర్తి స్థాయి ఆర్ఓ లేరు. దూరదర్శన్‌లో డైరెక్టర్ స్థాయిలో ఉన్న డాక్టర్ రాహుల్ గౌలికర్‌కు అదనంగా సెన్సార్ ఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి ఆర్ ఓ లేకపోవటం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు నిర్మా తలు పేర్కొంటున్నారు. దీనిపై సెన్సార్ బోర్డుకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఆర్ఓ ఐడీల జారీలో విపరీతమైన జాప్యం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు. వేరే రాష్ట్రాల్లోని ఏ ప్రాంతీయ సెన్సార్ ఆఫీసులో దరఖాస్తు చేసినా 24 గంటల్లో ఐడీ వచ్చేస్తుంది. మన దగ్గర మాత్రం వారాలు, నెలలు పడుతోంది' అని పేరు చెప్పటానికి ఇష్టప డని ఓ నిర్మాత వెల్లడించారు. ఐడీల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ ఒక ఉత్తరం కూడా రాసింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదని నిర్మాతలు తెలిపారు.

వందల సంఖ్యలో దరఖాస్తులు

మన దేశ సినీ రంగంలో టాలీవుడకు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా అత్యధిక సంఖ్యలో సినిమాల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది. వందల మంది నిర్మాతలు సినిమాలు తీస్తూ ఉంటారు. తమ బ్యానర్ల ఐడీల కోసం దరఖాస్తులు చేస్తుంటారు. డాక్టర్ రాహుల్ గౌలికర్‌కు సెన్సార్ బోర్డు ఆర్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచీ తమకు కష్టాలు మొదలయ్యాయని, కొత్త కొత్త నిబంధనల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని. పలువురు నిర్మాతలు చెబుతున్నారు. ఒక ప్రముఖ స్టూడియోకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ మాట్లాడుతూ.. 'బ్యానర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆధార్, పాన్ కార్డ్ వంటి కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడైనా ఇదే ప్రక్రియ అమలులో ఉంది. కానీ మన దగ్గర మాత్రం అదనంగా ఒక అఫిడవిట్‌ను జత చేయ మంటున్నారు. అఫిడవిట్ జత చేసి దరఖాస్తు చేసిన తర్వాత కూడా ఐడీ ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు.

ఇటీవల ఒక అగ్రనిర్మాత ఐడీ కోసం దరఖాస్తు చేస్తే.. ఆయనను రెండు నెలలపాటు తిప్పించిన తర్వాతే ఐడీ ఇచ్చారు. కొత్త నిర్మాతల విషయంలో అదనపు సమాచారం అడిగారంటే అర్ధం చేసుకోవచ్చు. నాలుగైదు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఉన్న నిర్మాతలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది' అని చెప్పారు. ఐడీ జారీ చేయకపోవటానికి సెన్సార్ కార్యాలయం పేర్కొంటున్న కారణాలు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయని కొందరు నిర్మాతలు తెలిపారు. స‌ఆధార్ కార్డులో ఫొటో సరిగ్గా లేదనే సాకుతో ఐడీ జారీ చేయలేదు. మరొకరి విషయంలో, ఐడీ కోసం తీయించుకున్న కొత్త పాస్‌ఫోర్టు ఫొటో కాకుండా, పాత ఫొటో తీసుకురమ్మన్నారు. పాత ఫొటోను ఎలా తీసుకు వస్తాం? ఈ తరహా నిబంధనలు దేశంలో ఎక్కడా లేవు. ఇంచార్జి ఆర్ఓకు మా సమస్యలు చెప్పటానికి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు. ఫోన్‌లో అందుబాటులో ఉండరు. దీనివల్ల ఆయనకు సమస్య ఉండకపోవచ్చు. మాకు మాత్రం నష్టం జరుగుతోంది' అని ఒక నిర్మాత ఆందోళన వ్యక్తం చేశారు.

పూర్తిస్థాయి ఆర్ఓ నియామకమే పరిష్కారం

సెన్సార్ నిబంధనల ప్రకారం దేశంలో ఏ ప్రాంతీయ కార్యాలయంలోనైనా ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తాము అలా ప్రయత్నిస్తే మరింత జాప్యమవుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. 'ఇక్కడ ఐడీలు రావటం లేదని కొందరు ఇతర ప్రాంతాలలో దరఖాస్తులు చేశారు. ఆ దరఖాస్తులు తిరిగి హైదరాబాద్ కార్యాలయానికే వచ్చాయి. ఇతర ప్రాంతాలలో దరఖాస్తులు చేస్తున్నారనే కోపంతో వాటి ఐడీల జారీని మరింత జాప్యం చేశారు. దీంతో

నష్టం మరింత పెరిగింది' అని నిర్మాతల మండలికి చెందిన ఈసీ సభ్యుడొకరు తెలి పారు. సెన్సార్ బోర్డు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి పూర్తి స్థాయి ఆర్ఓను నియమిస్తే ఈ సమస్యలు తీరుతాయని ఫిల్మ్ చాంబర్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు చైర్మన్ వెంపటి శశికుమార్ తెలుగువారేనని, ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 05:25 AM