బేబమ్మ కెరీర్‌కు LIK టర్నింగ్‌ పాయింట్‌ కానుందా..?

ABN , Publish Date - Apr 06 , 2026 | 09:25 AM

'నీ కన్ను నీలి సముద్రం' అంటూ కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన బేబమ్మ గుర్తుందిగా..? టాలీవుడ్‌లోకి ఉప్పెనలా (Uppena) దూసుకొచ్చిన కృతి శెట్టి (Krithishetty), మొదటి మూడు సినిమాలతోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ, ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. అపజయాలు ఆమె నీడలా వెంటాడుతున్నాయి.

Krithi Shetty

ఒక్క సినిమా.. కేవలం ఒక్క సినిమా ఒక నటి తలరాతను మార్చేస్తుంది. 'నీ కన్ను నీలి సముద్రం' అంటూ కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన బేబమ్మ గుర్తుందిగా..? టాలీవుడ్‌లోకి ఉప్పెనలా (Uppena) దూసుకొచ్చిన కృతి శెట్టి (Krithishetty), మొదటి మూడు సినిమాలతోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ, ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. అపజయాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. వరుస అవకాశాల పొందిన ఆమె ఇప్పుడు తెలుగులో కనుమరుగై పోయింది. బంగార్రాజు చిత్రం తరువాత నుంచి వరుసగా అమ్మడు ఏడు ఫ్లాపులు అందుకుంది. ఒక విధంగా కృతిశెట్టికి ఇది పెద్ద పరీక్షే..  ఒక క్రేజీ హీరోయిన్ కెరీర్‌లో ఇలాంటి వరుస ఫ్లాపులు మామూలు విషయం కాదు. ఇలాంటి టైంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 'లైక్‌' మూవీతో రాబోతుంది.

కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఉప్పెన, నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు కొట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ సమయంలో కృతి కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేమిటంటే అప్పట్లో ఆమె నెక్స్ట్ సూపర్ స్టార్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అప్పుడే అసలు కష్టాలు మొదలయ్యాయి. వరుసగా 'ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ'.. ఇలా ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. కథల ఎంపికలో తడబాటో లేక అదృష్టం వెనుకాడటమో కానీ, ఏకంగా 7 సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. మధ్యలో 'ఎ.ఆర్.ఎం.' చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించినా, తెలుగులో మాత్రం కృతికి ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ రేసులో వెనకబడిపోయింది.

దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మీదే ఉన్నాయి. తమిళ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రోబోటిక్ ఫ్యూచర్‌లో ప్రేమ ఎలా ఉంటుంది..? ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందనే వెరైటీ కాన్సెప్ట్‌తో ట్రైలర్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో గోల్డెన్ హ్యాండ్‌లా మారారు. ఆయనకున్న ఆ క్రేజ్ ఇప్పుడు కృతికి శ్రీరామరక్షగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కృతిశెట్టికి ఈ సినిమా, ఆమె కెరీర్‌ను డిసైడ్ చేసే ఒక టర్నింగ్ పాయింట్. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. టాలెంట్ ఉండి కూడా అదృష్టం కలిసిరాని ఈ బేబమ్మకు, ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ ట్రాక్ ఏమైనా ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Updated Date - Apr 06 , 2026 | 12:57 PM