Anil Ravipudi: చిరు- వెంకీ ఓకే.. బాలయ్య- నాగ్ అంటే అవుతుందా
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:35 PM
టాలీవుడ్‌లో 'సక్సెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్' ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
Anil Ravipudi: టాలీవుడ్‌లో 'సక్సెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్' ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కమర్షియల్ సినిమాలను కామెడీతో కలిపి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లుగా మలచడంలో ఆయనది ఒక విలక్షణమైన శైలి. రాజమౌళి (Rajamouli) తర్వాత అపజయమే లేని దర్శకుడిగా అనిల్ రికార్డు సృష్టించారు. తన తొలి చిత్రం పటాస్ నుంచి లేటెస్ట్ హిట్ మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినవే. అనిల్ తనలో ఉన్న సబ్జెక్ట్ తో ఎంత పెద్ద స్టార్ ని అయినా మెప్పించగలడు. తన సినిమాలో నటించే ఏ హీరోయిన్ తోనైనా అంతే చనువుగా, స్నేహంగా మెలుగుతాడు. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతారను సైతం ప్రచారంలో భాగం చేయడంతో అతడెంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. నయనతారను అనీల్ కన్విన్స్ చేసిన విధానం చూసి సాక్షాత్తు చిరంజీవినే షాక్ అయ్యారు.
ఇక మన శంకరవరప్రసాద్ గారు హిట్ కావడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం వచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరందుకున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి స్వయంగా అనిల్ రావిపూడికి మల్టీస్టారర్ చేసే అవకాశం ఇచ్చారు. దీనివల్ల రాబోయే రెండేళ్లలో ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. కేవలం ఇద్దరితోనే కాకుండా.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలందరినీ కలిపి ఒకే సినిమాలో చూపించే సాహసోపేతమైన ప్లాన్ కూడా అనిల్ ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీలో ఏ హీరోతో పని చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలనేది దర్శకుడు మారుతి కల. 'రాజా సాబ్' ప్రమోషన్స్‌లో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించడం మారుతికి కాస్త కష్టమైన పనే అని చెప్పవచ్చు. కానీ, అనిల్ రావిపూడికి మాత్రం ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అనిల్ ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో వేర్వేరుగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అటు వెంకీ, ఇటు చిరంజీవిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. త్వరలోనే నాగార్జునతో కూడా పని చేసే అవకాశం ఉంది. కాబట్టి, ఆయన అడిగితే హీరోలు కాదనకపోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో అతిపెద్ద టాస్క్ ఏమిటంటే.. బాలకృష్ణ, నాగార్జునలను ఒకే కథలోకి తీసుకురావడమంటున్నాయి సినీ వర్గాలు. ఒకవేళ అనిల్ గనుక తన మేకింగ్ స్టైల్‌తో వీరిద్దరినీ కన్విన్స్ చేయగలిగితే, అది టాలీవుడ్‌లోనే ఒక సంచలనం అవుతుంది. ఈ నలుగురు దిగ్గజాలను ఒకే సినిమాలో చూపించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మరి అనిల్ కి ఇది సాధ్యమవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.