C Kalyan: అధ్యక్షుడిగా ఏకగ్రీవం.. నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం..

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:01 PM

సెప్టెంబర్ 6న తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సి.కల్యాణ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.

సెప్టెంబర్ 6న తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సి.కల్యాణ్ ( C.Kalyan) ఆధ్వర్యంలోని ప్యానెల్ ప్రెస్‌మీట్ (Maa Pannel) నిర్వహించింది. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ 'నన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కోసం విత్‌డ్రా చేసుకుని, మా ప్యానెల్‌కు తొలి విజయాన్ని అందించిన తమ్ముడు బండ్ల గణేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిర్మాతల మండలికి సంబంధించిన లెక్కలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో గిల్డ్ వాళ్లు వచ్చి చాలా విషయాలు చెప్పారు. కానీ ఏమీ చేయలేదు. నా గురించి, ప్రసన్న గురించి రకరకాలుగా మాట్లాడారు. గిల్డ్ పెట్టుకుని కొందరు కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు నిర్మాతలకు మెంబర్‌షిప్ కూడా ఇవ్వలేదు. మేమంతా దాసరి గారి శిష్యులం. నిర్మాతలకు ఏ సమస్య వచ్చినా ఛాంబర్‌లోనే కూర్చొని చర్చిస్తాం. అవసరమైతే చిరంజీవిగారిని, బాలయ్యబాబును కూడా కలుస్తాం. అంతేకానీ హోటళ్లలో మీటింగులు పెట్టి సమస్యలను పరిష్కరించుకునే పద్ధతి మాది కాదు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో విషయంలో నాకు చాలా అభ్యంతరం ఉంది. ఇద్దరు, ముగ్గురు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి తీసుకొచ్చిన జీవో అది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై రేవంత్ రెడ్డిగారిని, చంద్రబాబు గారిని కలిసి మా అభిప్రాయాలను తెలియజేస్తాం. మా ప్యానెల్ గెలిస్తే పరిశ్రమలోని పెద్దలందరితో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. వారి సలహాలు, సూచనలతో నిర్మాతల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కొత్త మెంబర్లకు మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పిస్తాం. విద్య కోసం, వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తీసుకొస్తాం. సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇవన్నీ మేము కొత్తగా తీసుకొచ్చేవి కాదు. గతంలో ఉన్న పథకాలే. మధ్యలో ఆగిపోయాయి. వాటిని మళ్లీ రెజ్యూమ్ చేస్తాం. నిర్మాతల మండలి కేవలం చారిటీ కోసం కాదు.. మా సభ్యుల సంక్షేమం కోసం ఉంది. భరత్ భూషణ్‌గారు ఛాంబర్ అధ్యక్షుడిగా  బాగా పని చేశారు. ఇప్పుడు ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా కూడా మాకు సపోర్ట్‌గా ఉన్నారు. విజయ్ చందర్‌గారు మాకు ల్యాండ్ ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసి నిర్మాతలకు ఉపయోగపడేలా చేయాలనే ఆలోచన ఉంది. గతంలో సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాం. దాని ద్వారా రెవెన్యూ కూడా వస్తుంది. ఆ విధంగా నిర్మాతల సంక్షేమ కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చాలని అనుకుంటున్నాం. చిన్న సినిమాలకు కూడా ఉపయోగపడేలా నిర్మాతల మండలి తరఫున ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దాన్ని చిన్న సినిమాలకు ఓటీటీ తరహా వేదికగా ఉపయోగించాలనుకుంటున్నాం. సినిమాల పబ్లిసిటీ వ్యవస్థను కూడా మళ్లీ నిర్మాతల మండలిలోకి తీసుకొస్తాం.మా ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్మాతల సమస్యలు తెలుసు. పదవుల కోసం కాకుండా నిర్మాతలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేమంతా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అందుకే నిర్మాతలందరూ మా ఆలోచనలు, మా ప్రణాళికలను పరిశీలించి ఓటు వేయాలని కోరుతున్నాను' అని అన్నారు. 

Updated Date - Sep 03 , 2026 | 02:17 PM