C Kalyan: అధ్యక్ష బరి నుంచి బండ్ల గణేష్‌ ఔట్‌.. సి.కళ్యాణ్‌ ఏకగ్రీవం

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:46 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి ఎన్నికలు సెప్టెంబర్‌ 6న జరగాల్సి ఉంది. అధ్యక్ష పదవి కోసం సీనియర్‌ నిర్మాత సి.కల్యాణ్‌ బరిలో ఉన్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి (Producers Council Elections) ఎన్నికలు సెప్టెంబర్‌ 6న జరగాల్సి ఉంది. అధ్యక్ష పదవి కోసం సీనియర్‌ నిర్మాత సి.కల్యాణ్‌ (C Kalyan) బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా మరో నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh) పోటీ పడాలనుకున్నారు. రెండేళ్లకు ఓసారి జరిగే ఎన్నికలు ఈ ఏడాది కల్యాణ్‌-గణేశ్‌ నడుమ మంచి రసవత్తరంగా జరగనున్నాయని భావించారంతా. అయితే ఇప్పుడు ప్లాన్‌ మారిందని తెలిసింది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడాలనుకున్న బండ్ల గణేశ్‌ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అధ్యక్ష బరి నుంచి తప్పుకొని సి.కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ నడుస్తోంది. ఆయన మద్దతుతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని సమాచారం. దీంతో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కల్యాణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిసింది. పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల ఐక్యత కోసం బండ్ల గణేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. పరిశ్రమ ప్రయోజనాల కోసం సి. కళ్యాణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆయన సహకరించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాతోపాటు ఫిల్మ్‌నగర్‌లో వైరల్‌ అవుతోంది. సీనియర్‌ నిర్మాతగా సి. కళ్యాణ్‌కు పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. నిర్మాతల సమస్యలు, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన ఉన్న ఆయన అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం పట్ల నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్‌లు, నిర్మాణ వ్యయం, థియేటర్ల సమస్యలు, ఓటీటీ విడుదల విధానాలు, నిర్మాతల ప్రయోజనాలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కళ్యాణ్‌ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది

Updated Date - Aug 28 , 2026 | 02:30 PM