ఇదేందయ్యా ఇది.. బోయపాటితో కార్తీ!
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:15 PM
మాస్ సినిమాల చిరునామాగా బోయపాటి శ్రీను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్క్రీన్ మీద హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపించవచ్చో, విలన్‌ను ఎంత భయంకరంగా సృష్టించవచ్చో బోయపాటి సినిమాలను చూస్తే అర్థమవుతుంది.
టాలీవుడ్‌లో "మాస్ సినిమాల చిరునామా"గా బోయపాటి శ్రీను (Boyapati Srinu) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్క్రీన్ మీద హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపించవచ్చో, విలన్‌ను ఎంత భయంకరంగా సృష్టించవచ్చో బోయపాటి సినిమాలను చూస్తే అర్థమవుతుంది. కేవలం ఫైట్లు, రక్తం మాత్రమే కాకుండా, ప్రేక్షకుడి నరాల్లో రక్తం ఉడికేలా చేసే హై-వోల్టేజ్ ఎలివేషన్లు ఆయన సొంతం. ఒక సాధారణ కథను కూడా తనదైన మేకింగ్ స్టైల్‌తో వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా మార్చడంలో ఆయన దిట్ట. మొదటి సినిమా నుండి మొన్నటి 'అఖండ-2' వరకు ఆయన ఎంచుకునే యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకమైన "బోయపాటి మార్క్" స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే, అఖండ-2 తర్వాత ఆయన ఎవరితో జతకట్టబోతున్నారనే విషయంపై గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు-2 సినిమా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా, అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ పేరు తెరపైకి రావడంతో సినీ ప్రియుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కార్తీ (Karthi) కి మాస్ యాక్షన్ సినిమాలంటే మక్కువ ఎక్కువే. మరోవైపు బోయపాటి శ్రీను తనదైన శైలిలో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో 'టాక్ ఆఫ్ ది టౌన్'గా మారింది. కార్తీ ఇమేజ్‌కు సరిపడే పక్కా మాస్ కథను బోయపాటి ఇప్పటికే సిద్ధం చేశారని, ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే సౌత్ ఇండియాలో ఇదొక భారీ క్రేజీ కాంబినేషన్ అవుతుందని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా బోయపాటి సినిమాల్లో హీరోల ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ పీక్స్‌లో ఉంటాయి. కార్తీ కూడా ప్రయోగాత్మక సినిమాలతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్లలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా 'యుగానికి ఒక్కడు', 'ఖైదీ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కార్తీ, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్‌లో ఎలా కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య కథా చర్చలు విజయవంతంగా ముగిస్తే, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ క్రేజీ కాంబో సెట్స్‌పైకి వెళ్తే గనుక, అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కోలీవుడ్ నుంచి తెలుగు మార్కెట్‌పై పట్టు పెంచుకుంటున్న కార్తీకి, బోయపాటి మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, వెండితెరపై బోయపాటి తన మార్క్ విధ్వంసాన్ని కార్తీతో ఎలా చూపిస్తారో వేచి చూడాల్సిందే.