Chennai Lovestory: కల్ట్ క్లాసిక్ ఇప్పుడు నచ్చలేదంటారేంట్రా

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:13 PM

వెండితెరపై విజయోత్సవాలు జరుపుకున్న కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకుల అభిరుచి మారిపోతుంటుంది.

Chennai Love Story

వెండితెరపై విజయోత్సవాలు జరుపుకున్న కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకుల అభిరుచి మారిపోతుంటుంది. థియేటర్లలో బిగ్ స్క్రీన్ విజువల్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు.. ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చాక కథ, కథనాల విషయంలో దారుణమైన విమర్శలు ఎదుర్కోవడం తరచుగా చూస్తుంటాం. తాజాగా కల్ట్ క్లాసిక్ అంటూ వచ్చిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.


కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయిరాజేష్ స్క్రిప్ట్ అందించగా ఎస్కేన్ నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య గత నెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన ఆదరణ సొంతం చేసుకుంది. మిశ్రమ స్పందనతో ప్రారంభమైనప్పటికీ తొలి వీకెండ్ నుంచి ఊపందుకొని, రెండో వారంలోనూ బలమైన వసూళ్లను సాధించింది. దాదాపు రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఆగస్టు 21 నుంచి సోనీలివ్ లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో సూపర్ సూపర్ అన్న ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ లో మాత్రం తీవ్ర స్థాయిలో పెదవి విరుస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను అంత పెద్ద హిట్ ఎలా చేశారంటూ సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


కథ విషయానికొస్తే.. ప్రేమించిన అజయ్.. పెళ్లి వద్దని వెళ్లిపోవడంతో నివి డిప్రెషన్ లో మందుకు బానిస అవుతుంది. చెన్నైలో జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ తో ఉంటున్న జీవితంలోకి స్టీపెన్ శంకర్ వస్తాడు. అనాధ అయిన స్టీపెన్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటాడు. అతని గతాన్ని తెలుసుకొని నివి హెల్ప్ చేస్తోంది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతోంది. పెళ్లి చేసుకోవాలనుకొనే టైమ్ కి స్టీపెన్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తరువాత అతను నివి ఏమైంది.. ? స్టీపెన్ ఆమె జీవితంలో నుంచి వెళ్లిపోయాడా.. ? లేదా అనేది కథ.


ఇక విమర్శలకు ప్రధాన కారణం సినిమాలోని సెకండాఫ్, దాని స్లో నెరేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. థియేటర్లలో గ్రాండ్ పాటలు, కలర్‌ఫుల్ విజువల్స్ ప్రేక్షకులను డైవర్ట్ చేయగలిగినప్పటికీ, ఓటీటీలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌లో చూసేటప్పుడు కథలోని లోపాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా హీరో చనిపోయి ఆత్మగా తిరిగి వచ్చే సన్నివేశాలు, స్లోగా సాగే క్లైమాక్స్ డ్రామా ఓటీటీ ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారిందని చెప్పుకొస్తున్నారు. ఆత్మగా మారాక.. స్టీవెన్.. నివిని అనుమానించడం, అజయ్ తో మాట్లాడకుండా చేయడం చాలా క్రింజ్ గా ఉందని అంటున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 23 , 2026 | 05:13 PM