సమంతకు కోర్టులో ఊరట.. ఆ వీడియోలు డిలీట్ చేయాల్సిందే
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:06 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత పెరిగిన తర్వాత చిత్రపరిశ్రమలోని నటీనటులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత పెరిగిన తర్వాత చిత్రపరిశ్రమలోని నటీనటులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, ఏఐ వాయిస్ క్లోనింగ్ వంటి సాంకేతిక దుర్వినియోగం వల్ల ప్రముఖ నటీనటుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడమే కాకుండా వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తున్నారు. నెట్టింట వైరల్ అయ్యే ఈ నకిలీ కంటెంట్ వల్ల సెలబ్రిటీలు పబ్లిక్ ఇమేజ్ కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రకమైన డిజిటల్ దోపిడీ, హక్కుల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో పలువురు ప్రముఖ నటులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, నటుడు జాకీ ష్రాఫ్.. టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులు తమ పేరు, గొంతు, ఫోటోలు, పర్సనాలిటీ రైట్స్‌ను ఇతరులు వ్యాపార ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వాడకుండా ఉండేందుకు ఢిల్లీ హైకోర్టు నుంచి ముందస్తు రక్షణ ఉత్తర్వులు పొందారు.
ఇదే దారిలో నటి సమంత రూత్ ప్రభు కూడా తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి, తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న నకిలీ వీడియోలపై సెప్టెంబర్ 2026లో బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన అనుమతి లేకుండా ఏఐ ద్వారా సృష్టించిన అశ్లీల వీడియోలు, ఏఐ చాట్‌బాట్స్, డిజిటల్ ఇమేజ్‌లను ఉపయోగిస్తున్నారని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సమంత తన దావాలో పేర్కొంది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బొంబాయి హైకోర్టు సమంతకు అనుకూలంగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. సమంత అనుమతి లేకుండా ఆమె పేరు, ఇమేజ్, గొంతు, ఏఐ రూపాలను ఉపయోగిస్తున్న కంటెంట్‌ను తక్షణమే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని గూగుల్, మెటా సహా 18 మంది డిఫెండెంట్లను ఆదేశించింది. ఇది జీవించే హక్కు కిందకి వస్తుందని స్పష్టం చేస్తూ, సమంతకు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ జస్టిస్ మాధవ్ జమ్‌దార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకనుంచి సమంతకు సంబంధించిన ఏ వీడియో కూడా ఆమె అనుమతి లేకుండా బయటకు రాదు. దీంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.