మెగాస్టార్ మూవీలో.. బాలీవుడ్ స్టార్‌!

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:30 AM

మన శంకరవరప్రసాద్ వంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi

ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ వంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ (Bobby Kolli) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్ర ప్రారంభోత్సవం ఏప్రిల్ 11నే జరగాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థకు చెందిన ఇతర ప్రాజెక్టుల సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమా గురించిన సరికొత్త అప్‌డేట్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఒక అత్యంత శక్తివంతమైన అతిథి పాత్ర ఉండబోతోందట. ఈ పాత్ర సినిమా గమనాన్ని మార్చడమే కాకుండా, థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన పూనకాలు తెప్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రోల్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. కేవలం క్లైమాక్స్ సమయంలో ఎంట్రీ ఇచ్చే ఈ క్యారెక్టర్, కథను ఊహించని మలుపు తిప్పుతుందట. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, అనిల్ కపూర్ మధ్య ఉన్న‌ స్నేహబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ స్వయంగా అడగితే ఆయన ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఇద్దరు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అది అభిమానులకు కన్నుల పండుగగా ఉండ‌నుంది.

దర్శకుడు బాబీ ఈసారి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా కథలో పొందుపరిచారట. యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ స్థాయిలో ఉంటాయో, సెంటిమెంట్ సీన్లు కూడా అదే స్థాయిలో గుండెకు హత్తుకునేలా ఉంటాయని సమాచారం. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ఒక పరిపూర్ణమైన సినిమాను అందించాలనే పట్టుదలతో బాబీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం ఇంటెన్స్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. కాకాజీ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈ సినిమాలో మెగాస్టార్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆయన లుక్ ఇక్కడ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే చిరు ఈ సరికొత్త లుక్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు కూడా మొదలుపెట్టారట. ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Apr 20 , 2026 | 06:30 AM