Biggboss 10: బిగ్‌బాస్ ‘అగ్ని పరీక్ష’ ఎప్పుడంటే..

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:02 PM

 బిగ్‌బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష' ప్రీమియర్ తేదీ అధికారికంగా ప్రకటించారు

 బిగ్‌బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష' ప్రీమియర్ తేదీ అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ఈ విషయాన్నీ తెలియజేశారు. ఆగస్టు 15 నుంచి జియోహాట్‌స్టార్‌తో పాటు 'స్టార్ మా'లో ఈ సీజన్  ప్రసారం కానున్నట్లు వెల్లడించారు.

కళ్యాణ్ పడాల ప్రయాణమే స్ఫూర్తి..

'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష' కేవలం ఒక షో మాత్రమే కాదు.. కలలు, పట్టుదల, మార్పు, విజయం అనే భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచే కార్యక్రమం. ఈ సందర్భంగా జియోహాట్‌స్టార్ విడుదల చేసిన లాంచ్ వీడియోలో సాధారణ వ్యక్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, బిగ్‌బాస్ విజేతగా ఎదిగిన కళ్యాణ్ పడాల జీవిత గాథను హృద్యంగా చూపించారు. 'కళ్యాణ్ పడాల ప్రయాణం ఎంతోమందిని ప్రభావితం చేసింది. 'ప్రతి వ్యక్తి పెద్ద కలలు కనాలని, కష్టపడాలని, ఎప్పుడూ వదులుకోకూడదని ప్రేరేపించింది" అంటూ  సోషల్ మీడియాలో చాలా మంది  స్పందిస్తున్నారు. 

'అగ్ని పరీక్ష' అంటే ఏమిటి?

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు పోటీదారుల సామర్థ్యం, మానసిక ధైర్యం, సహనశక్తి, వ్యక్తిత్వాన్ని పరీక్షించే వేదికే 'అగ్ని పరీక్ష'. ఇందులో విజయం సాధించిన వారికే బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ప్రతి టాస్క్ పోటీదారుల ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి, ఒత్తిడిని ఎదుర్కొనే తీరును పరీక్షించనుంది. ఈసారి ఎలాంటి టాస్కులు,  ట్విస్టులు, భావోద్వేగ క్షణాలు ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో 'అగ్ని పరీక్ష'ను విజయవంతంగా పూర్తి చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అదృష్టవంతులు ఎవరు? అనే చర్చ మొదలైంది.   

Updated Date - Aug 03 , 2026 | 04:20 PM