Heroines: హీరోల చుట్టూనే కథ.. హీరోయిన్స్‌కు తగ్గుతున్న స్పేస్!

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:29 PM

టాప్ స్టార్స్ భారీ బడ్జెట్ మూవీస్ లో  పేరున్న హీరోయిన్స్ పేర్లుంటాయి. కానీ సదరు చిత్రాల్లో వారికి తగ్గ పాత్రలే కనిపించడం లేదు.

టాప్ స్టార్స్ భారీ బడ్జెట్ మూవీస్ లో  పేరున్న హీరోయిన్స్ పేర్లుంటాయి. కానీ సదరు చిత్రాల్లో వారికి తగ్గ పాత్రలే కనిపించడం లేదు. స్టార్ హీరోయిన్స్ అందాల అభినయాన్ని చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ కలుగుతోంది. ఎందుకలా జరుగుతోంది...!?

ఊరించి... ఉసూరుమనిపించి...

టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ అనౌన్స్ మెంట్ రాగానే ఆ సినిమాల్లో ఫీమేల్ లీడ్ ఎవరు అన్నదానిపై సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలవుతుంది. తమ అభిమాన కథానాయకుల సరసన  నటించబోయే స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తే చాలు ఫ్యాన్స్ ఖుషీ అవుతూ ఉంటారు. జనాన్ని ఆకట్టుకొనే నేపథ్యంలోనే భారీ చిత్రాలలో టాప్ స్టార్స్ సరసన స్టార్ హీరోయిన్స్ నే ఎంపిక చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడొస్తున్న భారీ తెలుగు చిత్రాలను పరిశీలిస్తే వాటిలో ఎంతో పేరున్న తారలే కనిపిస్తారు. అయితే వారికి సదరు చిత్రాల్లో ఏలాంటి ప్రాధాన్యం ఉండడం లేదు. అదే విచిత్రంగా ఉంది. ఇటీవల విడుదలైన 'ద ప్యారడైజ్' మూవీలో కాయాదు లోహార్ నాయిక... కాయాదుకు ఇందులో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ దక్కిందని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవానికి కాయాదు మంచి డాన్సర్ - ఆమెపై ఊపేసే పాటలను ఊహించుకున్నారు సినీ ఫ్యాన్స్. అవేవీ లేకపోగా, ఆమె పాత్ర సైతం తక్కువగానే ఉండడంతో నిరాశ చెందారు.

గ్లామర్ కే పరిమితం...
భారీ తెలుగు చిత్రాలను పరిశీలిస్తే హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ లేకుండా పోయి చాలా రోజులే అవుతోంది. 'ట్రిపుల్ ఆర్' మూవీలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటించారు. కానీ, ఆమెపై తెరకెక్కిన సీన్స్ పట్టుమని పది కూడా లేవు. దానిని బ్యాలెన్స్ చేయడానికే రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' ఎండ్ టైటిల్స్ లో ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టి, అందులో యన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితోనూ అలియా చిందేసేలా చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఇదే యన్టీఆర్ తో 'దేవర',  రామ్ చరణ్ తో 'పెద్ది' చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అంతే. ఈ రెండు సినిమాల్లో టాప్ స్టార్స్ సరసన జాన్వీ నటిస్తుందని తెలియగానే ఆమె తల్లి శ్రీదేవి ఫ్యాన్స్ సైతం మురిసిపోయారు. అయితే రెండు చిత్రాల్లోనూ జాన్వీ కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

తేడా కనిపిస్తుంది...

యన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల్లోనే కాదు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడి, సలార్' చిత్రాల్లోనూ హీరోయిన్స్ కంటే ఇతర స్త్రీ పాత్రధారులకు ప్రాధాన్యం కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలను చూసినవారికి ఈ తేడా ఇట్టే తెలిసిపోతుంది... 'సలార్'లో శ్రుతి హాసన్ వేరే పాత్ర కథ చెబుతూ ఉంటే వినడానికి పనికి వచ్చింది. ఇక 'కల్కి 2898 ఏడి'లో దిశా పటానీ పాత్ర ఓ పాట, కొన్ని సీన్స్ కు పరిమితమయింది. మన స్టార్ హీరోస్ కు ఉన్న క్రేజ్ హీరోయిన్స్ కు ఉండదని మేకర్స్ భావిస్తున్నారా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. అందువల్లే అందాల తారలను కొన్ని సీన్స్ కు, కొన్ని పాటలకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది.


స్టార్ హీరోస్ పైనే ఫోకస్...
ప్రభాస్ హీరోగా రూపొందిన 'ద రాజాసాబ్'లోనూ పేరుకు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా, వారిలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో తెలిసిందే. అందులో నిధి అగర్వాల్ ప్రధాన నాయిక అనుకున్నా ఆమె పాత్ర నిడివి ఎంత?. ఆ చిత్రంలోనే కాదు 'హరిహర వీరమల్లు'లోనూ నిధి అగర్వాల్ పాత్ర ఎంత సేపు ఉంటుంది చెప్పండి. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీ ఖన్నా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. పోనీ మన తెలుగు దర్శకులు హీరోపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు కాబట్టి హీరోయిన్స్ రోల్స్ సినిమాలో తక్కువ స్పేస్ నే ఆక్రమిస్తాయని భావించవచ్చు. తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన 'గేమ్ చేంజర్'లోనూ కియారా అద్వానీ పాత్ర ఏ మేరకు ఉందో ఆలోచించండి. అంటే డైరెక్టర్స్ సైతం స్టార్ హీరోస్ పైనే ఫోకస్ పెడుతున్నారు.

ఫలితంపైనా ప్రభావం...

యంగ్ స్టార్స్ మూవీస్ లోనే హీరోయిన్స్ కు ప్రాధాన్యం ఉండదు అనుకుంటే పొరబాటే. సీనియర్ స్టార్ బాలకృష్ణ 'అఖండ-2'లోనూ సంయుక్త మీనన్ కొన్ని సీన్స్ కే పరిమితమైన విషయాన్ని మరచిపోరాదు. లేదనకుండా సంయుక్తను ఓ పాటలో నర్తింప చేశారు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో సంయుక్తా మీనన్ పూర్తిస్థాయిలో అలరించిన తీరును గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు పేరున్న తారలను చూడాలని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి పాత్రలు సినిమాల్లో అంతగా కనిపించక పోతే నిరాశ చెందుతారు. వారి నిరాశ సినిమా ఫలితంపైనా ప్రభావం చూపిస్తుందని మేకర్స్ మరచిపోరాదు.

నిరాశే కదా...

భారీ చిత్రాల్లో పేరున్న తారలను మరి ఎందుకని ఎంపిక చేసుకుంటున్నారు?. ఈ ప్రశ్న తప్పకుండా తలెత్తకమానదు. ఎందుకంటే గతంలో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన పలు బిగ్ మూవీస్ ను పరిశీలిస్తే వాటిలో హీరోయిన్ కు కూడా తగిన ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మధ్య మాత్రం హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసమో, లేక తమ ప్రాజెక్ట్ కు జనాల్లో క్రేజ్ రావడానికో ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ పేరున్న తారలనే ఎంచుకున్నా, వారి పాత్రల నిడివి తక్కువ ఉందని తెలిసి ఇతర స్టార్ హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. ఎలా తీసుకున్నా ప్రధాన నాయికగా టైటిల్స్ లో పేరు పడ్డ నటికి సినిమాలో తగిన పాత్ర లేకపోతే ప్రేక్షకులు నిరాశకు గురికాక మానరు.


గుర్తు పెట్టుకుంటారా...!?

హీరోయిన్స్ ను కొందరు దర్శకులే తమ కథలకు అనువుగా చక్కగా వినియోగించుకొంటున్నారు. గతంలోనూ హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ డాల్స్ గానే పరిగణించిన వారూ ఉన్నారు. అయితే హీరోయిన్స్ అభిమానులనూ  దృష్టిలో పెట్టుకొని గతంలో వారిని పాటల్లోనైనా అందంగా చూపించేవారు. వారి కోసం ప్రత్యేకంగా కనీసం మూడు పాటలు తీసేవారు. ఆ సినిమాలను నవతరం సినీజనం ఫార్ములా మూవీస్ గా కొట్టిపడేస్తుంటారు. ఇప్పుడు కొత్తదనం అంటూ మెయిన్ హీరోయిన్స్ కు పాటలే కాదు సీన్స్ కూడా లేకుండా చేస్తున్నారు. దర్శకులు తమ చిత్రాల్లో హీరోయిన్ పాత్ర ఏ మేరకు ఉంటుందో ముందే డిజైన్ చేసుకొని, వారి ఫ్యాన్స్ కోసమైనా కథలో వారికి ప్రాధాన్యతను కల్పించాలి.  కనీసం కథను ముందుకు తీసుకువెళ్ళే సీన్స్ లోనైనా వారిని నటింప చేస్తే సినిమాకే ఓ కళ వస్తుందని పరిశీలకుల మాట. మరి ఈ సత్యాన్ని బిగ్ మూవీస్ తెరకెక్కించేవారు ఎందరు గుర్తు పెట్టుకుంటారో చూద్దాం.

Updated Date - Sep 27 , 2026 | 06:06 PM