Summer 2027: వచ్చే ఏడాది.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే
ABN , Publish Date - May 04 , 2026 | 05:42 PM
ఈ యేడాది వేసవికి బాక్సాఫీస్ పెద్దగా కళకళలాడలేదు. ఇప్పటి దాకా ఈ సమ్మర్ లో ఒక్క బిగ్ స్టార్ మూవీ కూడా జనం ముందుకు రాలేదు.
Summer 2027: ఈ యేడాది వేసవికి బాక్సాఫీస్ పెద్దగా కళకళలాడలేదు. ఇప్పటి దాకా ఈ సమ్మర్ లో ఒక్క బిగ్ స్టార్ మూవీ కూడా జనం ముందుకు రాలేదు. ఈ సంవత్సరం వేసవిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'పెద్ది (Peddi)' జూన్ 4న సందడి చేయనుంది. ఆ తరువాత మరో వారానికి వేసవి ముగుస్తుంది. అందువల్ల 'పెద్ది'తోనే ఈ సమ్మర్ సందడి సాగనుందని చెప్పొచ్చు. అయితే వచ్చే యేడాది అంటే 2027 సమ్మర్ లో మాత్రం పలువురు టాప్ స్టార్స్ మూవీస్ బాక్సాఫీస్ బరిలో దూకనున్నాయని తెలుస్తోంది. వీరిలో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న 'స్పిరిట్ (Spirit)' రానుంది. ఈ మూవీ మార్చి 5వ తేదీన వెలుగు చూడనుంది. ఈ సినిమా రిలీజైన నెల రోజులకే ఏప్రిల్ 7వ తేదీన సినీ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న 'వారణాసి (Vaaranaasi)' విడుదల కానుంది. ఈ మూవీ ఎంతటి హంగామా క్రియేట్ చేస్తుందో అన్నదే అందరిలోనూ చోటు చేసుకున్న ఆసక్తి.
'వారణాసి' తరువాత ప్రేక్షకులను పలకరించబోయే బిగ్ మూవీ యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న సినిమా. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జూన్ 11న రిలీజ్ చేయనున్నారు. మార్చిలో ప్రభాస్, ఏప్రిల్ లో మహేశ్, జూన్ లో యన్టీఆర్ వస్తున్నారు. మరి మే లో ఏ టాప్ హీరో వస్తారు? అన్న దానిపై పలు మాటలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, బాబీ సినిమా సంక్రాంతి టార్గెట్ గా రూపొందనుంది. అయితే ఈ చిత్రం జనవరిలో రాకపోతే ఇక వేసవికే వస్తుందని వినిపిస్తోంది.
అలాగే బాలకృష్ణతో కొరటాల శివ రూపొందించే సినిమా కూడా పొంగల్ బరిలోనే దూకాలని చూస్తోంది. ఆ మూవీ రిలీజ్ ఆలస్యమైతే అది కూడా వేసవినే ఎంచుకుంటుందనీ తెలుస్తోంది. అలా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో ఏదో ఒకటి మే నెలను ఎంచుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. మరి రాబోయే సమ్మర్ సందడిలో ఏ యే స్టార్ మూవీస్ ప్రేక్షకులను మురిపిస్తాయో చూడాలి.