Prabhas Vs Balakrishna: డిసెంబర్‌లో.. ప్రభాస్, బాలయ్య ఢీ అంటే ఢీ

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:33 PM

టాలీవుడ్‌లో ఒకప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలను సినిమాల విడుదలకు అనుకూలమైనవిగా భావించేవారు కాదు.

Fauzi Nbk 111

టాలీవుడ్‌లో ఒకప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలను సినిమాల విడుదలకు అనుకూలమైనవిగా భావించేవారు కాదు. ఏ పెద్ద హీరోల చిత్రాలు కూడా ఆ సమయంలో థియేటర్ల ముందుకు వచ్చేవి కావు. అయితే కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత కొంతం కాలంగా ‘అఖండ’, ‘పుష్ప: ది రైజ్’, ‘సలార్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు డిసెంబర్ నెలలో అద్భుతమైన వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు ఈ సమయంపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ ఏడాది చివర్లో ఇద్దరు దిగ్గజ హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు నెలకొననుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi)ని డిసెంబర్ 3న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన నేపథ్యంలో సాగే ఈ కథపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘సీతారామం’ వంటి గొప్ప విజయాన్ని అందించిన దర్శకుడు కావడం వల్ల ఈ చిత్రంపై ఆసక్తి రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి, ఆగస్టు 15న ఓ గ్లింప్స్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, విజువల్ వండర్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

మరోవైపు, మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా డిసెంబర్ రేసులో ఉంది. మొదట దసరాకు విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల డిసెంబర్ 4ను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఒక్క రోజు వ్యవధిలోనే ప్రభాస్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండటం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో డిసెంబర్ నెలాఖరు బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ల మధ్య జరగనున్న ఈ సమరం ఎవరికి విజయాన్ని అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ నెలను బ్యాడ్ సీజన్ అనే కాలం పోయి, ఇప్పుడు అది బిగ్ సీజన్‌గా రూపాంతరం చెందడం సినీ పరిశ్రమలో పెద్ద మార్పుకు నిదర్శనం.

Updated Date - Jun 30 , 2026 | 02:38 PM