రాజమౌళి ‘వారణాసి’కి ఐమ్యాక్స్ బలం.. ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రీన్స్ దక్కే ఛాన్స్!

ABN , Publish Date - Aug 19 , 2026 | 10:07 PM

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ దక్కే అవకాశం ఉంది.

varanasi

'ట్రూ ఐమాక్స్ షూటింగ్' జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రాజమౌళి 'వారణాసి' నిలచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐమ్యాక్స్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఐ మ్యాక్స్ ఫార్మాట్ తో 'వారణాసి' ఓ ఛాలెంజ్ ఎదుర్కొంటోంది. అదేంటో చూద్దాం?

మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో డాక్టర్ కె.యల్.నారాయణ, కార్తికేయ నిర్మిస్తోన్న వారణాసి (Varanasi) ట్రూ ఐమ్యాక్స్ (True IMAX) షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీని దాదాపు 120 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను 'ట్రూ ఐ మ్యాక్స్ షూటింగ్ 'లో తెరకెక్కించారు. ఈ విధానంలో రూపొందిన తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి' నిలచింది. అందువల్ల 'వారణాసి' సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచంలోని ప్రముఖభాషల్లో అందులోనూ ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని భావించారు. 'ఆ సమయంలో ఏ లాంటి భారీ చిత్రాలు హాలీవుడ్ నుండి రావడం లేదని తెలుస్తోంది. అందువల్లే రాజమౌళి తన 'వారణాసి'కి కంఫోర్టబుల్ టైమ్ ను సెట్ చేసుకున్నారని సినీ పండిట్స్ భావిస్తున్నారు.

'వారణాసి'కే సింహభాగం...

గతంలోనూ 'ట్రిపుల్ ఆర్, జవాన్, కల్కి 2898 ఏడి" వంటి చిత్రాలు ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ప్రదర్శితమయినాయి. వీటికంటే ముందు 'ఐ మ్యాక్స్ ఫార్మాట్'లో సందడి చేసిన తొలి భారతీయచిత్రంగా 'ధూమ్-3' నిలచింది. కానీ, ఇవన్నీ ఐమ్యాక్స్ థియేటర్స్ లో ప్రదర్శన కోసం డిజిటిల్ గా రీమాస్టరింగ్ చేసిన సినిమాలే కావడం గమనార్హం. అలా కాకుండా ఒరిజినల్ ఐమ్యాక్స్ కెమెరాతోనే షూటింగ్ జరుపుకొన్న ప్రప్రథమ భారతీయ చిత్రంగా 'వారణాసి' చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ట్రూ 1.43 ఈజ్ టు 1 ఐమ్యాక్స్ రేషియోలో రూపొందింది. అందువల్ల పలు దేశాల్లోని ఐమ్యాక్స్ స్క్రీన్స్ 'వారణాసి'కి లభించే ఛాన్స్ ఉంది. ప్రపంచంలోని 90 దేశాల్లో మొత్తం 1800 ఐమ్యాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో ఒక్క చైనా దేశంలోనే అత్యధికంగా 800 పైగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ చోటు చేసుకున్నాయి. చైనాలోని సినీ ఫ్యాన్స్ 'ఐమ్యాక్స్ ఫార్మాట్'ను అత్యధికంగా లైక్ చేయడం వల్ల 'ఐమ్యాక్స్' సంస్థ అక్కడ అన్ని స్క్రీన్స్ ను ఏర్పాటు చేసింది. 2027 ఏప్రిల్ లో 'వారణాసి' రిలీజ్ సమయానికి చైనా నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవీ రిలీజ్ కావడం లేదు. అలాగే హాలీవుడ్ భారీ చిత్రాలేవీ రావడం లేదు. అందువల్ల చైనాలోని ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో సింహభాగం 'వారణాసి'కే లభిస్తాయని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.

మ్యాక్స్ తో భారీ వసూళ్ళు...

ట్రూ ఐమ్యాక్స్ షూటింగ్ లో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీగా 'వారణాసి' రానుంది కాబట్టి మన దేశంలోని అన్ని ఐమ్యాక్స్ స్క్రీన్స్ ఈ చిత్రానికే లభించేలా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి దాకా 45 ఐమ్యాక్స్ స్క్రీన్స్ జనాన్ని అలరిస్తున్నాయి. 'వారణాసి' విడుదలయ్యే నాటికి మరో పది ఐమ్యాక్స్ స్క్రీన్స్ పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. సినిమాకు పుట్టిల్లయిన ఫ్రాన్స్ లోనూ, భారీ మూవీస్ కు కేంద్రమైన హాలీవుడ్ లోనూ కలిపి 200 కు మించి ఐమ్యాక్స్ ఒరిజినల్ స్క్రీన్స్ లేవు. వాటిలోనూ 'వారణాసి'కే ఎక్కువ థియేటర్స్ దక్కే అవకాశం ఉందని పరిశీలకుల మాట. సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'వారణాసి' ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్ కారణంగా భారీ వసూళ్ళు చూసే ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. ఎందుకంటే క్రిస్టఫర్ నోలాన్ మూవీస్ లో చాలావరకు ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనే తెరకెక్కి అలరిస్తున్నాయి. అలాగే రాజమౌళి 'వారణాసి' కూడా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని పరిశీలకుల భావన. 'వారణాసి' ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

Updated Date - Aug 19 , 2026 | 10:07 PM