నటుడు తనికెళ్ల భరణికి.. భజరప్ప సార్మక పురస్కారం

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:23 AM

రవీంద్రభారతిలో నిర్వహించిన సిరిమువ్వ కల్చరల్స్ రజతోత్సవ వేడుకల్లో తనికెళ్ల భరణికి భజరప్ప స్మారక పురస్కారం ప్రదానం చేశారు.

Tanikella Bharani

రంగస్థలానికి భజరప్ప (Bhajarappa) చేసిన సేవలు ఎనలేనివని ఆయన నాటక రంగాభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని విశ్రాంత ఐఏఎస్ డా. కేవీ రమణాచారి అభివర్ణించారు. బుధవారం రవీంద్రభారతి (Ravindra Bharathi) లో సిరిమువ్వ కల్చరల్స్ (Sirimuva Culturals) సంస్థ 25 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, దర్శకుడు దివంగత భజరప్ప స్మారక పురస్కారాన్ని (Bhajarappa Memorial Award) నటుడు, రచయిత తనికెళ్ల భరణికి (Tanikella Bharani) ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి (KV Ramanachari) పురస్కారగ్రహీత తనికెళ్ల భరణిని సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన భజరప్ప చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని తనికెళ్ల భరణికి అందజేయడం సముచితమైన నిర్ణయమని ఆయన అన్నారు.

భరణి అటు సినిమాల్లో ఇటు రంగస్థలంలో తనదైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందుతున్నారని అన్నారు. ఈతరం యువతకు తనికెళ్ల భరణి ఆద ర్శప్రాయుడని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య డి.ఎస్.ఎన్.మూర్తి, కోట శంకరరావు, బి.సంధ్యారెడ్డి, సంజయ్ కిషోర్ తదతరులు పాల్గొన్నారు. సభకు ముందు ట్రాప్ నాటికను ప్రదర్శించారు. చిలువూరు నాగేశ్వరరావు రచించిన ఈ నాటకానికి మంజునాథ దర్శకత్వం వహించారు. చక్కటి నటనతో నటీనటులు ఆకట్టుకున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 10:43 AM