Bhagyashri Borse: నా ఆఖరి సినిమా కూడా తెలుగులోనే చేస్తా..
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:52 PM
ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇక్కడ పరిచయం అవ్వడం ముఖ్యం కాదు.. విజయం అందుకుంటూనే గుర్తింపు లభిస్తుంది. ఎన్ని సినిమాలు చేశాం అనేది కాదు.. ఎన్ని హిట్స్ ఇచ్చాం అనేదే కనపడుతుంది.
ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇక్కడ పరిచయం అవ్వడం ముఖ్యం కాదు.. విజయం అందుకుంటూనే గుర్తింపు లభిస్తుంది. ఎన్ని సినిమాలు చేశాం అనేది కాదు.. ఎన్ని హిట్స్ ఇచ్చాం అనేదే కనపడుతుంది. మొదటి సినిమాతోనే స్టార్స్ అయిన వారు ఉంటారు. కొన్నిసార్లు అది వారి లక్. కానీ.. కొంతమంది మొదటి సినిమాతో మెప్పించినా.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోతారు.అలాంటి వారిని ఐరెన్ లెగ్ అనేస్తారు. ఈ ట్యాగ్ చాలామంది హీరోయిన్లకు ఉంది. తాజాగా ఆ ట్యాగ్ నుంచి బయటకు వచ్చింది భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). అందం, అభినయం ఉన్నా కూడా ఇప్పటివరకు అమ్మడు ఒక్క హిట్ అందుకున్నది లేదు. వరుస ఫ్లాపులు వస్తున్నా అవకాశాలు తగ్గకపోయినప్పటికీ, మనసులో ఒక సాలిడ్ హిట్ కోసం ఆరాటపడిన భాగ్యశ్రీకి.. ఎట్టకేలకు అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రం కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కళ్లల్లో ఆనంద భాష్పాలు తెచ్చింది.
అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న లెనిన్ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎదుర్కొన్న విమర్శలు, సినిమా కోసం పడిన కష్టం, ముఖ్యంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున తన నటనపై కురిపించిన ప్రశంసలను గుర్తుచేసుకుంటూ కంటనీరు పెట్టుకుంది.
'నా అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వారు చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న రీల్స్, ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. ఈ చిత్ర బృందం నాకు ఒక కుటుంబంలా సపోర్ట్ చేసింది. హైదరాబాద్ నా కర్మభూమి. నా సినీ ప్రయాణంలో ఆఖరి సినిమా కూడా ఈ టాలీవుడ్‌లోనే చేయాలని కోరుకుంటున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం భాగ్యశ్రీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఈ చిన్నది ముందు ముందు మరిన్ని విజయాలను అందుకుంటుందేమో చూడాలి.