Theater experience: కొత్త టెక్నాలజీ.. కొత్త ఎక్స్‌పీరియెన్స్‌.. ఆ కిక్కే వేరప్ప..

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:08 PM

రోజులు మారుతున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. పేక్షకుల అభిరుచి, ఆలోచన రెండూ మారుతున్నాయి.. చేసే పనిలోనే కాదు.. ఎంజాయ్‌మెంట్‌లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు..

రోజులు మారుతున్నాయి..
టెక్నాలజీ పెరుగుతోంది..
పేక్షకుల అభిరుచి, ఆలోచన రెండూ మారుతున్నాయి..
చేసే పనిలోనే కాదు.. ఎంజాయ్‌మెంట్‌లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు..

ఎంటర్‌టైన్‌మెంట్‌ అనగానే గుర్తొచ్చేది సినిమా.. ఒకప్పటి సినిమా థియేటర్‌ అనుభూతికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా ప్రేక్షకుడు కూడా ఎట్రాక్షన్‌, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నాడు.

ఇప్పుడు సింగిల్‌   స్క్రీన్స్  హవా తగ్గింది. అంతా మల్టీప్లెక్స్‌ మాయాజాలమే నడుస్తోంది. పైగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్‌గా మారింది. ఓటీటీ రూపంలో ఇంట్లోనే మినీ హోమ్‌ థియేటర్‌ ఉన్నప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అయితే సినిమాకు క్రేజ్‌ ఉండాలి. సినిమాకు కథ, కథనం, ఆర్టిస్టులు ఎంత ముఖ్యమో.. సరికొత్త అనుభూతి కూడా అంతే ముఖ్యం. హాల్లో సినిమా చూస్తున్నామనే భావన కంటే ఆ కథలో మనం కూడా భాగమయ్యే అనుభూతి కోసమే ఆరాటపడుతున్నారు సినీ లవర్స్‌. ఆ అనుభూతి పంచే దిశగా కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఈ తరహా టెక్నాలజీ ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఐమ్యాక్స్‌, ఐమ్యాక్స్‌ విత్‌ లేజర్‌, స్క్రీన్‌ఎక్స్‌, 4Dx తదితర స్క్రీన్‌ ఫార్మాట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. మరి ఆయా ఫార్మాట్ల ప్రత్యేకతలేంటో చూద్దామా.. 


ఐమాక్స్‌ ఫార్మెట్‌:

మామూలు 35 ఎంఎం, 70ఎంఎం థియేటర్‌   స్క్రీన్స్ తో పోలిస్తే ఇది చాలా పెద్ద తెర. నయా ప్రొజెక్షన్‌ మెషినరీ, వినూత్నరీతిలో సౌండ్‌ సిస్టమ్‌ ఐమాక్స్‌ ప్రత్యేకత. ముఖ్యంగా యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌, అడ్వెంచర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా సాగే చిత్రాలను ఐమాక్స్‌లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. దీంతో సినిమాలో ప్రపంచంలోకి ప్రేక్షకుడు మరింతగా లీనమయ్యే అవకాశం ఉంటుంది.

LAsez.jpg

ఐమ్యాక్స్‌ విత్‌ లేజర్‌:

ఐమాక్స్‌లో లేజర్‌ స్క్రీనింగ్.. ఇదొక ప్రీమియం అనుభూతిని అందించేది. ఇందులో లేజర్‌ ప్రొజెక్షన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తారు. సాధారణ ప్రొజెక్షన్‌తో పోలిస్తే మరింత లైటింగ్‌, స్పష్టమైన చిత్రాలను, నేచురల్‌ కలరింగ్‌తో చూపించడం దీని ప్రత్యేకత. చీకటి సన్నివేశాల్లోని ప్రతి అంఽశాన్ని మరింత క్లియర్‌గా చూపిస్తుంది. అందుకే విజువల్‌ రిచ్‌ సినిమాలకు ఈ ఫార్మాట్‌ మంచి ఆప్షన్‌గా మారుతోంది.

ఐమాక్స్‌ త్రీడీ:

స్టీరియోస్కోపిక్‌ 3డీ విజువల్స్‌కు అనుగుణంగా రూపొందించిన ఫార్మాట్‌ ఇది. తెరపై కనిపించే దృశ్యాలు ప్రేక్షకుల వైపు వస్తున్నట్లుగా అనిపిస్తాయి. భారీ యాక్షన్‌ సన్నివేశాలు, అంతరిక్ష నేపథ్యాలు, ఫాంటసీ, ప్రకృతి విపత్తులు, అందాలు వంటి వాటిని త్రీడీలో చూడటం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది, సాధారణ ప్రొజెక్షన్‌తో కంపేర్‌ చేస్తే ఇది మరింత ఇమర్సివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Dolby cinema.jpeg

డాల్బీ సినిమా:
విజువల్‌తోపాటు సౌండ్‌కు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఫార్మాట్‌ డాల్బీ సినిమా. డాల్బీ విజన్‌ లేజర్‌ ప్రొజెక్షన్‌, డాల్బీ అట్మాస్‌ మల్టీడైమెన్షనల్‌ సౌండ్‌ టెక్నాలజీ కలయిక దీని ప్రత్యేక. స్ర్కీన్‌పై మెరుగైన కాంట్రాస్ట్‌, నార్మల్‌   స్క్రీన్స్ తో పోలిస్తే రెండింతలు ప్రకాశవంతమైన రంగులు కనిపించడంతో పాటు థియేటర్‌లోని వివిధ దిశల నుంచి శబ్దాలు వినిపించేలా దీని సౌండ్‌ డిజైన్‌ ఉంటుంది. ఉదాహరణకు సినిమాలో ఓ విమానం ప్రేక్షకుడి తలపై నుంచి వెళుతున్నట్లుగా ఉంటే.. ఆ శబ్దం పై నుంచి వస్తున్న అనుభూతి కలుగుతుంది. దీంతో విజువల్‌, ఆడియో రెండూ కలిసి ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.  

Screen X.jpeg

సినిమా స్క్రీన్స్ ఎక్స్‌:

ఇది మన చుట్టూ విస్తరించే ఫార్మెట్‌. సాధారణంగా మనం సినిమా ఎదురుగా ఉన్న తెరపై చూస్తుంటాం. కానీ   స్క్రీన్ ఎక్స్‌లో మెయిన్‌  స్క్రీన్ తోపాటు ఎడమ పక్క, కుడి పక్క కూడా   స్క్రీన్స్  ఉంటాయి. సన్నివేశాలకు తగ్గట్టు కుడి, ఎడమ   స్క్రీన్స్ లపై కూడా ప్రొజెక్షన్‌ జరుగుతుంది. ఇది 270 డిగ్రీ పనోరమిక్‌ అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌, కార్‌ ఛేజింగ్‌, భారీ యుద్థ సన్నివేశాల్లో ఈ టెక్నాలజీ ప్రేక్షకుడికి తాను కూడా ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా అనిపించేలా చేస్తుంది. అయితే దీని కోసం చిత్రీకరణ సమయంలో ప్రత్యేక ఫార్మెట్‌ కెమెరాలను వాడాల్సి ఉంటుంది. ‘స్పైడర్‌మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే’ సినిమాను విదేశాల్లో  స్క్రీన్ ఎక్స్‌ ఫార్మెట్‌ థియేటర్స్‌లో ప్రదర్శించారు.

4DX.jfif

4డీఎక్స్‌:

సినిమాలో సన్నివేశాలను అనుగుణంగా 4డీఎక్స్‌ థియేటర్‌లో ఏర్పాట్లు ఉంటాయి. కేవలం కళ్లకు, చెవులకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా కొత్త అనుభూతిని అందించాలంటే 4డీఎక్స్‌   స్క్రీన్స్ లో సినిమా చూడాల్సిందే. సినిమాలో ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా థియేటర్‌లోని సీట్లు కదులుతాయి. యాక్షన్‌ లేదా ఛేజింగ్‌ సన్నివేశాల్లో సీట్లు ముందుకు, వెనక్కి కదలడం, వైబ్రేషన్స్‌ రావడం వంటి ఎఫెక్టులు ఉంటాయి. వర్షం పడే సన్నివేశాల్లో నీటి చినుకులు, గాలి వీచే సన్నివేశాల్లో గాలి, హీరో హీరోయిన్లు పూలవనం లో మాట్లాడుకుంటుంటే చక్కని వాసన వంటి ప్రత్యేక ఎఫెక్టులు అందించడం దీని ప్రత్యేకత. అంటే తెరపై హీరో వర్షంలో పరుగెత్తుతుంటే.. ప్రేక్షకుడు కూడా థియేటర్‌లో ఆ వర్షాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. అందుకే 4డీఎక్స్‌ను కేవలం సినిమా చూడటం కాకుండా ‘సినిమాలో ప్రయాణించడం’గా చెప్పొచ్చు.

MX4D.jpg

ఎంఎక్స్‌4డీ:
4డీఎక్స్‌ తరహాలోనే ఈ థియేటర్‌లోనే కదిలే సీట్లు, వైబ్రేషన్స్‌, గాలి, నీటి చినుకులు, ఇతర వాతావరణ ఎఫెక్టులతో సినిమా సన్నివేశాలకు అనుగుణంగా థియేటర్‌లో అనుభూతిని సృష్టిస్తారు. దీంతో సాధారణ సినిమా ప్రదర్శనకు, ఎంఎక్స్‌4డీ అన్ఘుభవానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.  

అయితే ఈ టెక్నాలజీలన్నింటి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే.. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి పంచడం.. మళ్లీమళ్లీ థియేటర్‌కు రప్పించడం. రాబోయే రోజుల్లో  సినిమాకు వెళ్లేముందు ‘ఏ సినిమా?’ అనే ప్రశ్నతో పాటు ‘ఏ ఫార్మాట్‌లోలో చూస్తున్నావు?’ అనే ప్రశ్న కూడా అంతే ముఖ్యంగా మారొచ్చు. 

Updated Date - Aug 18 , 2026 | 04:10 PM