God Of War: త్రివిక్రమ్ కన్నా ముందు కిషోర్ తిరుమల.. సెట్ అయ్యేనా
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:03 PM
దేవుడి సినిమాలు ఎంతమంది తీసినా.. ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. తాజాగా ఒకే దేవుడి మీద ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కన్నేశారు. వారే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ), కిషోర్ తిరుమల (Kishore Tirumala).
God Of War: దేవుడి సినిమాలు ఎంతమంది తీసినా.. ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. తాజాగా ఒకే దేవుడి మీద ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కన్నేశారు. వారే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ), కిషోర్ తిరుమల (Kishore Tirumala). గత కొంతకాలంగా త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పేరుతో.. శివుడి చిన్న కుమారుడు అయిన సుబ్రమణ్యస్వామి కథను తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కుమారస్వామిగా బన్నీ కనిపించబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే బన్నీ.. గురూజీని పక్కన పెట్టి అట్లీ సినిమాను పట్టాలెక్కించేసరికి.. గాడ్ ఆఫ్ వార్ చేతులు మారి ఎన్టీఆర్ చెంతకు చేరిందని సమాచారం.
ఇక ఈమధ్య కాలంలో బన్నీ మళ్లీ గాడ్ ఆఫ్ వార్ ని సొంతం చేసుకున్నాడని, ఎన్టీఆర్ ని పక్కకు తప్పించి ఆ ప్రాజెక్ట్ ని చేజిక్కించుకున్నాడని, త్వరలోనే బన్నీ - గురూజీ మైథలాజికల్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో స్టార్ డైరెక్టర్ సైతం తాను కూడా ఇలాంటి కథనే రాసుకొని హీరోల కోసం వెతుకుతున్నాను అని చెప్పడం సంచలనంగా మారింది.
నేను శైలజ, చిత్రలహరి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు దర్శకత్వం వహించాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగుతుంది. రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కిషోర్ తిరుమల తాను ఎప్పటి నుంచో మైథలాజికల్ కథ చేయడానికి స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్లు తెలిపాడు. సుబ్రమణ్యస్వామి కథతో గౌరీ తనయ అనే టైటిల్ ని కూడా అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ళ క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని, పెద్ద స్పాన్ ఉన్న కథ కావడంతో స్టార్ నటీనటులు, టెక్నీషియన్స్ అవసరమని, వారికోసమే వెతుకుతున్నట్లు తెలిపాడు. ఆ లెక్కన గాడ్ అఫ్ వార్, గౌరీ తనయ రెండు ఒకే కథతో తెరకెక్కుతున్నట్లు. మరి ఆ స్వామి ఇద్దరిలో ముందు ఎవరి చెంతకు చేరతాడో చూడాలి.