Bandla Ganesh: నాది రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:30 AM
సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన మొక్కు తీర్చుకునేందుకు కాలి నడకన తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన మొక్కు తీర్చుకునేందుకు కాలి నడకన తిరుమలకు బయల్దేరనున్నారు. సోమవారం ఉదయం 9గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని జానంపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిన్న ఈవెంట్ నిర్వహించి వెంటనే తిరుమలకు పాదయాత్ర సంకల్ప యాత్ర (Sankalpa Yatra) ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి శివాజీ (Shivaji), టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఇతర ప్రముఖులు హజరై బండ్ల గణేశ్ గురించి ప్రసంగించారు. గణేష్ యాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ యాత్ర కాదు. దేవుడి మొక్కు మాత్రమేనని, చంద్రబాబు గారిపై అభిమానంతో, నాకు దైవ సమానులు పవన్ కల్యాణ్ గారి ఆశీస్సులతో ముందడుగు వేసి నడిచి వెళ్తున్నా అని అన్నారు. నేను చిరంజీవి గారిని చూద్దామని ఇండస్ట్రీ కి వచ్చాను. అలాంటి చిరంజీవి గారి సినిమా నా ధియేటర్ లో ఆడుతుండగా సంకల్ప యాత్ర మొదలు పెట్టాను అన్నారు.
గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై మోపిన అభాండాలు, కుట్రపూరిత కేసులు, అరెస్ట్ నన్ను ఎంతో బాధించింది. జైలు నుంచి ఆయన ప్రాణాలతో బయటకు తీసుకు వస్తే ఏడుకొండల స్వామి వారిని దర్శించుకుంటానని గతంలో సుప్రీంకోర్టు మెట్లపై నిలబడి మొక్కుకున్నా అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు జైలు నుంచి రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అలాగే చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటినీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టి వేయగా చంద్రబాబు గారు జూలు విదిల్చిన సింహంలా జైలు నుంచి బయటకు వచ్చి మాలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో తన మొక్కును చెల్లించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు. నేడు ఇది నా ఒక్కడి అడుగు కాదు. ప్రతి తెలుగువాడి అడుగు అంటూ ముగించారు.