బండ్ల గణేష్ ని చెప్పుతో కొట్టిన హీరో..
ABN , Publish Date - May 24 , 2026 | 07:37 PM
ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్స్ గా ఉన్నవారందరూ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా ఒకరు.
ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్స్ గా ఉన్నవారందరూ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్ గా మారి.. నిర్మాతగా ఎదిగి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఒక బిజినెస్ మ్యాన్ గా మంచి స్థాయిలో ఉన్న బండ్లన్న.. త్వరలోనే మళ్ళీ నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కించాలని చూస్తున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులను తన మాటలతో, పోస్టులతో అలరించే బండ్ల గణేష్ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.
తాజాగా నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్ క్యాస్ట్ లో బండ్ల గణేష్ గెస్ట్ గా విచ్చేశాడు. ఈ పాడ్ క్యాస్ట్ లో తన కెరీర్ లోనే మర్చిపోలేని అవమానాల గురించి ఏకరువు పెట్టాడు. అవమానాలు అంటే చాలా ఉన్నాయని, పెళ్ళైన కొత్తలో తనకు మారుతీ కారు ఉండేదని, చెక్ బౌన్స్ అయ్యి ఆ కేసును తీసుకెళ్ళిపోతే మా అన్నయ్య ఆ డబ్బు కట్టడంతో నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యానని చెప్పాడు. ఇక ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి కారణం లేకుండా తనను చెప్పుతో కొట్టాడని, అది పెద్ద అవమానమని చెప్పి షాక్ ఇచ్చాడు.
' ఒక పెద్ద మనిషి.. పేరు చెప్తే బాగోదు. ఊరికే కూర్చుంటే చెప్పు తీసుకొని కొట్టాడు. అప్పట్లో నాకు పెద్ద పని ఏం ఉండేది కాదు. సెట్ కి వెళ్ళి కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని. ఆరోజు నాకు బాగా గుర్తుంది. సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు. నేను, వేరే నటుడు కూర్చొని ఉన్నాం. ఏ టెన్షన్ లో ఉన్నాడో ఏమో.. నేను సార్.. సార్ అని ఊరికే పిలిచా.. చెప్పు తీసుకొని కొట్టాడు.. సంబంధం లేకుండా.. భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా. ఆయన చాలా మంచోడే.. నాకు చాలా సహాయం కూడా చేశాడు. ఏ టెన్షన్ లో కొట్టాడో నాకు తెలియదు.. ఆ తరువాత రోజు నాకు వచ్చి సారీ కూడా చెప్పాడు. కానీ, అది నాకు చాలా అవమానంగా అనిపించింది.
ఎవరిమీదనో గొడవ అయితే నన్ను ఎందుకు కొట్టాడు అంటే.. జీవితంలో మనుషులు కోపం వస్తే పనికిరాని వస్తువులను పగలకొడతారు. ఆ సమయంలో నేను అలానే కనిపించాను ఆయనకు. విలువ తక్కువ వస్తువుపైనే మన ప్రతాపం చూపిస్తాం. మనకంటే బలహీనుడు మీదనే మన విశ్వరూపం చూపిస్తాం. బయటకు వచ్చి పక్కన ఉన్న ఆయనతో చెప్పాను. బాబాయ్.. నా దగ్గర డబ్బు లేదనే కదా ఆయన నన్ను చెప్పుతో కొట్టాడు. ఆయనకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేష్ కాదని చెప్పాను. అది నా అచీవ్ మెంట్' అని చెప్పాడు. ప్రస్తుతం బండ్లన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పెద్ద వ్యక్తి ఎవరు అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.