Bandla Ganesh: చిరు ఇంట్లో బండ్ల గణేష్.. విషయం ఏంటంటే
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:03 PM
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆగస్టు 16న జరగనున్న ఈ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖను కుటుంబసమేతంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌తో కలిసి దిగిన ఫొటోలను బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. 'నేను చిత్రసీమలోకి రావడానికి స్పూర్తినిచ్చిన అన్నయ్య, ఎంతోమందికి మార్గదర్శి, మా బిగ్‌బాస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను కుటుంబసమేతంగా కలిసి, నా కుమార్తె జనని వివాహానికి ఆహ్వానించి, వారి అమూల్యమైన ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
బండ్ల గణేష్‌కు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ఆయన గతంలోనూ ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. తన సినీ జీవితానికి చిరంజీవే స్ఫూర్తి అని, ఆయన ఆశీస్సులే తనకు గొప్ప బలం అని పలుమార్లు చెప్పిన గణేష్.. ఇప్పుడు తన కుమార్తె పెళ్లి వంటి కుటుంబ వేడుకకు స్వయంగా వెళ్లి ఆహ్వానించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జననికి ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆగస్టు 16న జరగనున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.