బాలయ్య, వివేక్ ఆత్రేయ చిత్రం లేనట్టే!

ABN , Publish Date - May 23 , 2026 | 02:05 PM

నందమూరి బాలకృష్ణ, వివేక్‌ ఆత్రేయ సినిమా ప్రస్తుతానికి లేదని తెలుస్తోంది. దీనిని రవితేజతో నిర్మించడానికి మైత్రీమూవీ మేకర్స్ రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Balakrishna

స్టార్ హీరోలతో అనుకున్న సినిమాలు అనుకున్న విధంగా పట్టాలు ఎక్కడం అంత సామాన్య విషయం కాదు. సదరు దర్శకులు స్టార్ హీరోకు కథ చెప్పగానే మీడియాలో వారి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందంటూ ప్రచారం మొదలవుతుంది. నిజానికి ఆ కథకు హీరో ఓకే చెప్పాడో లేదో కూడా తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసేస్తుంటారు. ఒక్కోసారి హీరో, దర్శకుడికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రకటన అధికారికంగా వచ్చినా కూడా రకరకాల కారణాల వల్ల అది సెట్స్ పైకి వెంటనే వెళ్ళదు.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించిన రెండు సినిమాల విషయంలో అలాంటి చర్చే జరుగుతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణకు, వివేక్‌ ఆత్రేయ ఓ కథ చెప్పాడు. అది విని బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీన్ని రెండు భాగాలుగా తీయాలని వివేక్ ఆత్రేయ అనుకున్నాడట. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ సినిమా దసరా తర్వాత సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. అయితే కారణాలు ఏవైనా... ఈ సినిమా నిర్మించాలనుకున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు దీనిని పక్కన పెట్టేశారట. ఇప్పుడు అదే కథను మాస్ మహరాజా రవితేజాకు వివేక్‌ ఆత్రేయ చెప్పాడని, ఆయన అంగీకరించాడని అంటున్నారు. రవితేజతో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం రవితేజ... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత వివేక్ ఆత్రేయ మూవీనే పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ సినిమాను మలినేని గోపీచంద్‌ తో చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో కొరటాల శివతో మూవీ చేయడానికి బాలకృష్ణ సిద్థపడ్డాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే... తాజాగా ఫైనల్ నెరేషన్‌ విన్నా బాలకృష్ణ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, దాంతో కొరటాల శివ మళ్ళీ కొత్త కథ మీద కూర్చోబోతున్నాడని ఫిల్మ్ నగర్‌ సమాచారం. కొరటాల శివ చిత్రంలో బాలకృష్ణ కార్పెంటర్‌గా నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే 'దేవర'కు ముందు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' సినిమాలోనూ చిరంజీవి కార్పెంటర్ గానే కనిపించారు. ఆ సినిమాకు ప్రతికూల ఫలితం లభించిన నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ తన తాజా చిత్రంలో అదే పాత్ర చేయడానికి అంగీకరించలేదని అంటున్నారు. దాంతో హీరో ప్రొఫెషన్ ను మార్చుతూ కొరటాల ఇంకో కథను సిద్థం చేస్తున్నారట. అందుకే ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలు కావాల్సిన ఈ సినిమా పట్టాలెక్కడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు.

Updated Date - May 23 , 2026 | 02:05 PM