బాలయ్యను అల్లుకున్న ముంబై సెంటిమెంట్
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:46 PM
నటసింహ బాలకృష్ణ తాజా చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకోనుందని టాక్. అప్పుడే సినీ ఫ్యాన్స్ లో ఈ మూవీపై ఓ స్పెషల్ డిస్కషన్ స్టార్టయింది. అదేంటో చూద్దాం.
బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తోన్న చిత్రంపై సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సింగిల్ రోల్‌నే పోషిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య ద్విపాత్రాభినయంతో 'వీరసింహారెడ్డి' ద్వారా బంపర్ హిట్ పట్టేసిన గోపీచంద్ మలినేని ఈ సారి ఒకే పాత్రలో ఏ రీతిన అలరిస్తారో అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. అలాగే ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరగనుందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది.
'ముంబైలో షూటింగ్' అనగానే బాలయ్య ఫ్యాన్స్ ఎందుకని ఆదుర్దా చెందుతున్నారు? ఎందుకంటే గతంలో బాలకృష్ణ నటించిన 'అశోక చక్రవర్తి' సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అలాగే ముంబైలో షూటింగ్ జరుపుకోక పోయినా, కథానుగుణంగా బాలయ్య 'లయన్' మూవీలో ముంబై ప్రస్తావన ఉంటుంది. ఇక బాలయ్య తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందిన 'అఖండ-2-తాండవం' ముంబైలోనే ముందుగా ప్రచారం ఆరంభించింది. ఈ చిత్రాలు కూడా బాలయ్య ఫ్యాన్స్ కు అంతగా ఆనందం పంచలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య కొత్త సినిమాలో ముంబై బ్యాక్ డ్రాప్ ఉందని తెలియగానే కొందరిలో నిరుత్సాహం చోటు చేసుకుంది.
ముందే ఊహించుకుంటే ఎలా...!?
సెంటిమెంట్స్ చుట్టూ సినిమారంగం పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే కొందరు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగి మురిపించే విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఆ కోణంలో ఆలోచిస్తే ఎస్. ఎస్. రాజమౌళి అంతకు ముందు ఉన్న ఎన్నో సెంటిమెంట్స్ ను పటాపంచలు చేశారు. తెలుగు సినిమాకు సీక్వెల్స్ అచ్చిరావు అంటే 'బాహుబలి' సిరీస్ తో అనూహ్య విజయం సాధించారు రాజమౌళి. అలాగే భారతస్వరాజ్య నేపథ్యంతో రూపొందిన చిత్రాలు తెలుగునాట అంతగా మురిపించలేదు అన్న సెంటిమెంట్ ను కూడా ఆయన 'ట్రిపుల్ ఆర్' చెరిపేసింది. అలా గోపీచంద్ మలినేని సైతం తన కథకు అనుగుణంగా ముంబైని ఎంచుకొని ఉండవచ్చు. గతంలో బాలయ్యను అల్లుకున్న సెంటిమెంట్స్ ను తుడిచేసి కొత్తగా సక్సెస్ ను అందించవచ్చు. సో- ముందు బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రెండో మూవీ పూర్తయి ప్రేక్షకులను పలకరించాలి. అప్పుడు కదా అసలు విషయం తెలిసేది! ముందుగానే ఏవేవో ఊహించుకుంటే ఎలా? ఈ రీతిన కొందరు ఆలోచిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.