ఫ్యాన్స్‌కు బాలయ్య ఝలక్.. సింహం సింగిల్ రోల్‌లోనే
ABN , Publish Date - May 27 , 2026 | 01:44 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల కంటే అత్యంత వేగంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ జతకడుతుండటంపై టాలీవుడ్ వర్గాల్లో కొండంత అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంటోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంతో బాలయ్య తన రెగ్యులర్ రొటీన్ ట్రెండ్‌కు కాస్త బ్రేక్ వేస్తున్నట్లు సమాచారం. ‘అఖండ’ సినిమాతో మొదలైన కంబ్యాక్ ట్రెండ్‌ను గమనిస్తే, మొన్నటివరకు ఆయన చేసిన చిత్రాలన్నీ డ్యూయల్ రోల్స్ లేదా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలతోనే సాగాయి. కానీ ఈసారి గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య కేవలం ఒక్క పాత్రలోనే, ఒకే ఒక పవర్‌ఫుల్ షేడ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో డబుల్ రోల్స్ చేయకపోయినా.. క్యారెక్టరైజేషన్ పరంగా రెండు వేరియేషన్స్ చూపించారు. కానీ ఈ నయా ప్రాజెక్ట్‌లో ఎలాంటి వేరియేషన్స్ లేకుండా సింగిల్ రోల్‌లోనే మెప్పించనుండటం నందమూరి అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది.
ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. యంగ్ హీరో మంచు మనోజ్ విలన్‌గా పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటించి మెప్పించారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై రిపీట్ అవుతుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ మూవీలో గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోందని టాక్ వినిపిస్తున్నప్పటికీ, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే బాలకృష్ణ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. వచ్చే నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, ముహూర్తపు వేడుక ఘనంగా జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకదాని వెనుక ఒకటిగా ఇలాంటి భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ బాలయ్య బాక్సాఫీస్ వద్ద తన దండయాత్రను కొనసాగిస్తున్నారు.