మరోమారు బాలయ్య ద్విపాత్రాభినయం!

ABN , Publish Date - May 11 , 2026 | 03:20 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. తన తరం హీరోల్లో అత్యధిక సార్లు 'డ్యుయల్ రోల్' పోషించి మెప్పించిన ఘనత బాలయ్యదే. అందువల్ల రాబోయే బాలయ్య ద్విపాత్రాభినయంపైనా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

Nandamuri Balakrishna

నటసింహ బాలకృష్ణ (Balakrishna) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Atreya) డైరెక్షన్ లో రూపొందబోయే సినిమా పట్టాలెక్కక ముందే ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి దాకా బాలకృష్ణ దాదాపు 18 చిత్రాలలో డ్యుయల్ రోల్ లో కనిపించి అలరించారు. సదరు సినిమాల్లో సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉండటం విశేషం. అందువల్ల బాలయ్య మరో సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తారని తెలిసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.


ఆ క్రెడిట్ బాలయ్యదే...

బాలకృష్ణ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కె. రాఘవేంద్రరావు (K. Raghavendrarao) రూపొందించిన 'అపూర్వ సహోదరులు'. అప్పట్లో ఈ సినిమా పోటీ చిత్రాలపై పై చేయి సాధించింది. ఆ తరువాత బాలయ్య నటించిన 'ఆదిత్య 369, పెద్దన్నయ్య, చెన్న కేశవ రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి' వంటి సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వీటిలో కొన్ని గోల్డెన్ జూబ్లీస్, కొన్ని డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఇక 'లెజెండ్' సినిమా ఏకంగా వెయ్యి రోజులకుపైగా ప్రదర్శితమై సౌత్ ఇండియాలోనే ఒక చరిత్ర సృష్టించింది. ఓ స్టార్ హీరో డ్యుయల్ రోల్ పోషించి, ఇంతటి ఘనవిజయం సాధించడం బాలయ్యకే చెల్లింది.


'లెజెండ్' తరువాత బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు 'అఖండ' (Akhanda), 'వీరసింహారెడ్డి' సైతం ఘనవిజయం సాధించాయి. అలా వరుసగా డ్యుయల్ రోల్స్ తో గ్రాండ్ సక్సెస్ చూసిన ఘనత కూడా బాలయ్యకే చెల్లింది. ఈ కారణంగానే బాలయ్య ఫ్యాన్స్ వివేక్ ఆత్రేయ సినిమాలోనూ తమ హీరో రెండు పాత్రలు పోషిస్తున్నారని తెలిసి ఆనందిస్తున్నారు. బాలయ్యతో తమ తొలి సినిమాల్లోనే ద్విపాత్రలు చేయించి విజయం చూసిన వారిలో సింగీతం శ్రీనివాసరావు, వి.వి. వినాయక్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని ఉన్నారు. బాలయ్యతో డ్యుయల్ రోల్ చేయిస్తూనే తొలిసారి ఆయన చిత్రానికి పనిచేస్తున్నారు వివేక్ ఆత్రేయ. మరి బాలయ్య-వివేక్ కాంబో ఏ తీరున జనాన్ని అలరిస్తుందో చూడాలి.

Updated Date - May 11 , 2026 | 03:21 PM