అనిల్ Vs హరీష్ శంకర్! బాలయ్యతో.. సినిమాకు పోటీ
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:09 AM
‘దాదా’, NBK112 సినిమాల తర్వాత బాలకృష్ణతో అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ సినిమాలు చేసే అవకాశం ఉందంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. బాలయ్య నెక్స్ట్ మూవీపై ఆసక్తికరమైన అప్‌డేట్.
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఆయన సినిమా వస్తుందంటే చాలు, నందమూరి అభిమానులకు థియేటర్ల వద్ద పండగే పండగ. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నారు. 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో 'NBK112' తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్‌గా పూర్తయ్యాయి. 'దేవర' లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేస్తుండడం, తొలిసారి బాలయ్యతో జతకడుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది.
అయితే, ఈ సినిమాల తర్వాత బాలయ్య లైనప్‌లోకి మరో ఇద్దరు ప్రముఖ దర్శకులు వచ్చి చేరినట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో మొదటివారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా పూర్తికాగానే బాలయ్య బాబుతో మరోసారి జతకట్టేందుకు ఒక అదిరిపోయే కథ సిద్ధం చేశారట. ఇప్పటికే అనిల్ చెప్పిన లైన్‌కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక బాలయ్య లైనప్‌లో వినిపిస్తున్న మరో పేరు.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar). ఇటీవలే హరీష్ శంకర్ కూడా బాలయ్యకు ఒక పవర్ ఫుల్ స్టోరీ వినిపించినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. హరీష్ శంకర్ ఇటీవల తెరకెక్కించిన 'ఉస్తాద్ భగత్ సింగ్', 'మిస్టర్ బచ్చన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆయన ఫామ్ కాస్త డల్‌గా ఉండడంతో, బాలయ్య ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, గత ఏడాది చివరల్లో వచ్చిన 'అఖండ 2' సినిమా అభిమానులను ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. దీంతో రాబోయే సినిమాల విషయంలో బాలయ్య చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారట. కథల విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారట. మరి కొరటాల శివ సినిమా తర్వాత బాలయ్య... అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తారా? లేక హరీష్ శంకర్‌తో సినిమా చేస్తారా? అనేది వేచి చూడాలి.