అప్పుడు బాలయ్య.. ఇప్పుడు మనోజ్! అస‌లేం జరుగుతోంది 'దాదా'

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:34 PM

ఆ మధ్య హీరోకు యాక్సిడెంట్... ఈ మధ్య విలన్ కు ప్రమాదం... అయినా ఆగకుండా సాగుతోంది 'దాదా' సినిమా షూటింగ్. అంటే అనుకున్న డేట్ కే 'దాదా' సందడి చేసే ఛాన్స్ ఉందన్న మాట.

Balakrishna

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'దాదా' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ మొదటి వారానికి మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇందులో విలన్ గా నటిస్తోన్న మంచు మనోజ్ షూటింగ్ లోనే ప్రమాదానికి గురయినట్టు తెలుస్తోంది. అయినా చిత్రీకరణకు అంతరాయం కలుగకుండా మనోజ్ నటిస్తున్నారని సమాచారం. ఈ యేడాది జూలై 21న ఇదే సినిమా షూటింగ్ లో బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. మోకాలుకు గాయం కావడంతో ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. దాంతో బాలయ్య కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య కూడా షూటింగ్ లో హుషారుగా పాల్గొంటున్నారు. అప్పుడు హీరో - ఇప్పుడు విలన్ గాయాల పాలయినా 'దాదా' కోసం శ్రమిస్తూ ఉండడం ఇప్పుడు సినీజనాల్లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


సినిమా షూటింగ్స్ లో నటీనటులకు గాయాలు కావడం, ప్రమాదాన్ని బట్టి వారు విశ్రాంతి తీసుకోవడం మళ్ళీ కెమెరా ముందుకు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు బాలకృష్ణ ప్రమాదాలకు గురయ్యారు. అయినా ఈ నాటికీ ఉత్సాహంగానే ఆయన షూటింగ్స్ పాల్గొంటూ అభిమానులకు ఆనందం పంచుతున్నారు. 'దాదా' షూటింగ్ ను పూర్తి చేసేసి, ఈ యేడాది డిసెంబర్ 24నే విడుదల చేయడానికి యూనిట్ మొత్తం కృషి చేస్తోంది. బాలకృష్ణ డెడికేషన్ చూసి మిగిలిన వారు సైతం ఎంతో క్రమశిక్షణతో షూటింగ్ పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కు కూడా షూటింగ్ లో యాక్సిడెంట్ అయినా దానిని లెక్క చేయకుండా నటిస్తూ ఉండడం గమనార్హం.

టాలీవుడ్ సీనియర్ స్టార్ అయిన బాలయ్యకు, యంగ్ జెనరేషన్ కు చెందిన మనోజ్ విలన్ గా నటిస్తూ ఉండడమే ఆసక్తికరమైన అంశం. ఈ మధ్య మనోజ్ ప్రతినాయకునిగా కనిపించిన 'మిరాయ్, భైరవం' చిత్రాలు రెండూ ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో 'మిరాయ్' బంపర్ హిట్ గా నిలచింది. ఇప్పుడు మనోజ్ విలన్ గా నటిస్తోన్న మూడో చిత్రం 'దాదా'. ఇందులో సీనియర్ స్టార్ బాలకృష్ణతో ఢీ కొంటున్నారు. తన తరం స్టార్స్ తో ఢీ కొంటూ నటించడం మనోజ్ కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే బాలయ్య లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తో నటించినప్పుడే కదా తన సత్తా తెలిసేది అనే ఉద్దేశంతో మనోజ్ ఉన్నారట. అందువల్లే 'దాదా'ను అనుకున్న సమయానికే పూర్తి చేయడానికి మనోజ్ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగి 'దాదా' డిసెంబర్ 24నే వస్తే అభిమానులకు కన్నుల పండుగే. మరి ఏ తీరున 'దాదా' జనాన్ని మురిపిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మహేశ్ బాబుకు డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే..

‘భోగి’ ప్రమోషన్స్‌.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?

ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

Updated Date - Nov 25 , 2026 | 09:18 PM