బాలయ్య-కొరటాల మూవీ.. ముహూర్తానికి డేట్ ఫిక్స్!
ABN , Publish Date - May 25 , 2026 | 06:58 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సామాజికాంశాలను కమర్షియల్ పంథాలో అద్భుతంగా ఆవిష్కరించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి విదితమే.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), సామాజికాంశాలను కమర్షియల్ పంథాలో అద్భుతంగా ఆవిష్కరించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి విదితమే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలోనూ అపరిమితమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ముహూర్తపు వేడుక తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 25న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా, గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత, ఆగస్టు నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది మే నెలలోనే వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాంబినేషన్ ప్రకటించిన అతి తక్కువ సమయంలోనే, బాలకృష్ణకు సంబంధించిన లుక్ టెస్టులను కూడా మేకర్స్ అత్యంత రహస్యంగా పూర్తి చేసినట్లు టాలీవుడ్ టాక్. 'దేవర' వంటి భారీ సక్సెస్ తర్వాత కొరటాల శివ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్‌తో కూడిన ఒక ‘భారీ మాస్ యాక్షన్ డ్రామా’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని, కమర్షియల్ హంగులను జోడించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కథకు అవసరమైన ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియలో ఆయన పూర్తి బిజీగా గడుపుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో పాటు కాస్టింగ్ ఫైనలైజేషన్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అటు బాలయ్య- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నట్లు టాక్. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారట. ఇందుకోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రంగంలోకి దిగి, బాలకృష్ణ కోసం ఒక స్పెషల్ హెయిర్ స్టైల్, లుక్‌ను డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఓ కథానాయికగా, ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలన్ సంజయ్ దత్‌ను సంప్రదించినట్లు సమాచారం. మరి బాలయ్య-కొరటాల కాంబినేషన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే!.