బాలకృష్ణ‌-కొరటాల మూవీ! అల్ట్రా స్టైలిష్ లుక్‌లో బాలయ్య.. రంగంలోకి ఆలిమ్ హకీమ్

ABN , Publish Date - May 22 , 2026 | 07:20 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ (nandamuri balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (koratala siva) దర్శకత్వంలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండటంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక విలక్షణమైన డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.సమాజానికి పనికొచ్చే ఒక మంచి సందేశాన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణపై ప్రత్యేకంగా ఒక లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. మేకర్స్ ప్లాన్ ప్రకారం వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అత్యంత వైభవంగా, గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత దసరా పండుగ కానుకగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘NBK111’ చిత్రం పూర్తి కాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

బాలకృష్ణ కెరీర్‌లో ‘NBK112’గా రాబోతున్న ఈ క్రేజీ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ముందే ఒక పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కథకు అవసరమైన ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియలో ఆయన పూర్తి బిజీగా గడుపుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీనటుల ఫైనలైజేషన్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రంగంలోకి దిగి, బాలకృష్ణ కోసం ఒక స్పెషల్ హెయిర్ స్టైల్ అండ్ లుక్‌ను డిజైన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే.. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఓ కథానాయికగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలన్ సంజయ్ దత్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కొరటాల శివ ప్రాజెక్ట్ అనుకోకుండా లైన్‌లోకి రావడంతో, బాలకృష్ణ తన రాబోయే చిత్రాల షెడ్యూల్‌లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం ఆయన లైన్‌లో పెట్టిన ఇతర సినిమాలపై పడింది. ముఖ్యంగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయాల్సిన సినిమా కాస్త ఆలస్యం కానుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడటంతో, కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత.. అంటే దాదాపు 2027 చివరి భాగంలో వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - May 22 , 2026 | 07:42 AM