NBK112: బాలయ్య-కొరటాల మూవీ ఓపెనింగ్.. చీఫ్ గెస్ట్‌లు ఎవరంటే?

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:13 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న #NBK112 చిత్రం జూన్ 25న ఘనంగా ప్రారంభం కానుంది.

టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ ఒక ఊహించని సంచలనం. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర ఎలా ఉంటుందో దశాబ్దాలుగా చూపిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు.. కమర్షియల్ సినిమాకు పక్కా సామాజిక సందేశాన్ని జోడించి ఇండస్ట్రీ హిట్స్ అందించే ‘స్టార్ డైరెక్టర్’ కొరటాల శివ (Koratala Siva) మరోవైపు. ఈ ఇద్దరి భిన్నమైన శైలుల కలయికలో రాబోతున్న చిత్రమే '#NBK112'. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, అంతే హుందాగా కనిపిస్తూ మైండ్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. మరి బాలయ్య విషయానికొస్తే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఊరమాస్ యాక్షన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక అంటే.. "కొరటాల మార్క్ పదునైన కథనానికి, బాలయ్య మార్క్ గర్జన తోడైతే" బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఈ భారీ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అత్యంత వైభవంగా లాంచ్ కాబోతోంది. జూన్ 25న ఉదయం 9 గంటలకు ఏపీలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ విద్యాశాఖ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ (Nara Lokesh)తో పాటు, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలపనున్నారు. రాజకీయ, సినీ గ్లామర్ నడుమ జరగనున్న ఈ ఓపెనింగ్ వేడుక ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లకు, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తోడు కానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరినీ థియేటర్లకు రప్పించేలా ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ ప్రాజెక్ట్‌ను 'న భూతో న భవిష్యతి' అనే రీతిలో నిర్మించేందుకు భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ చిత్రానికి సౌత్ ఇండియాస్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలయ్య మాస్ ఇమేజ్‌ని, కొరటాల ఎమోషన్‌ని ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందోనని అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో, ఎలాంటి కొత్త చరిత్రను సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Jun 24 , 2026 | 10:13 PM