Balakrishna, Dil Raju: బాలయ్య, మార్కో డైరెక్టర్‌తో.. దిల్ రాజు సినిమా?
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:01 PM
'మార్కో' దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు ఓ సినిమా తీయబోతున్నట్టు యేడాది క్రితమే ప్రకటించాడు. అయితే ఆ పాన్ ఇండియా మూవీలో బాలకృష్ణ హీరోగా నటించబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
గత యేడాది మార్చి 20న దిల్ రాజు (Dil Raju) ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. 'మార్కో' (Marco) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హనీఫ్ అదేని (Haneef Adeni) తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తారని, శిరీష్ దీనికి ప్రెజెంటర్ గా ఉంటారని, ఇదో మల్టీస్టారర్ మూవీ అని అప్పట్లో చెప్పారు. గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీత తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని అన్నారు. అయితే దాదాపు యేడాది గడిచినా ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ రాలేదు. కాకపోతే ఇప్పుడు ఆ వార్త మరోసారి వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఇప్పుడో సరికొత్త సమాచారం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదేని తో తీయబోతున్న సినిమా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో అని తెలుస్తోంది. కారణాలు ఏవైనా బాలకృష్ణ, దిల్ రాజు కాంబినేషన్ లో ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. దాంతో కొన్నేళ్ళుగా బాలకృష్ణతో సినిమా నిర్మించాలని దిల్ రాజు అనుకుంటున్నారు. ఒకసారి ఆ కాంబోలో సినిమా అంటూ వస్తే... అది ఇద్దరి కెరీర్లోనూ మైలురాయిగా నిలిచేది కావాలి. అందుకే దిల్ రాజు ఇంతకాలం ఓపిక పట్టారని తెలుస్తోంది.
మలయాళ చిత్రం 'మార్కో'లో విపరీతమైన హింస ఉన్నా... హనీఫ్ మేకింగ్ ను అంతా మెచ్చుకున్నారు, అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'మార్కో' మలయాళంలోనే కాకుండా ఆ తర్వాత వివిధ భాషల్లో డబ్ అయ్యి పలు రాష్ట్రాలలో మంచి విజయాన్నే అందుకుంది. బాలకృష్ణకు సరిపడే యాక్షన్ డ్రామాను హనీఫ్ తయారు చేసుకున్నాడని, అందుకే దిల్ రాజు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు మలినేని గోపీచంద్ తో తన 111వ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత 'దిల్' రాజు మూవీ పట్టాలెక్కుతుందేమో చూడాలి.