బాలయ్య, కొరటాల సినిమా స్టోరీ ఇదేనా? బాక్సాఫీస్ బ‌ద్ద‌లే

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:19 PM

బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టా లెక్కబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి సినిమాలు తీయడంలో కొరటాలది ప్రత్యేక శైలి. బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి కొరటాల క్లాస్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి మే నెలలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమా కోసం బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారనే వార్త ప్రాజెక్టుపై అంచనాలను అమాంతం పెంచేసింది. కొరటాల శివ తన కథల్లో హీరోల లుక్స్ మరియు క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు గెటప్‌ను పూర్తి భిన్నంగా డిజైన్ చేశారట. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారని, ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

సినిమాలోని సెకండ్ హాఫ్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ద్వితీయార్థంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్స్‌లను కొరటాల ప్లాన్ చేశారని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఆ ఫ్లాష్ బ్యాక్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా జోడించారట. బాలయ్య పాత్ర చుట్టూ అల్లిన ఈ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని, ముఖ్యంగా ఆ మాస్ ఎలిమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని సమాచారం.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. బాలయ్య బాబును ఒక మాఫియా డాన్‌గా లేదా ఆ ప్రపంచంతో సంబంధం ఉన్న ఒక శక్తివంతమైన వ్యక్తిగా కొరటాల చూపించబోతున్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో బాలయ్యను చూపిస్తూనే, మరోవైపు కుటుంబ విలువలకి మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ఈ కథలో పెద్దపీట వేశారట. కథా గమనం అంతా ప్రత్యేకంగా ఉండబోతుందని, బాలయ్య మార్క్ మాస్‌తో పాటు కొరటాల మార్క్ సందేశం కూడా అంతర్లీనంగా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం.

ఎన్టీఆర్ తో చేసిన 'దేవర' వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో, ఆయన ఈ కథపై చాలా కసరత్తులు చేశారట. స్క్రిప్ట్ వర్క్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి బాలయ్య-కొరటాల ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఒక సంచలనంగా మారబోతుందనడంలో సందేహం లేదు.

Updated Date - Apr 27 , 2026 | 07:08 PM