Asura Samharam: విలేజ్ డిటెక్టివ్ గా తనికెళ్ళ భరణి
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:49 PM
తనికెళ్ళ భరణి విలేజ్ డిటెక్టివ్ గా నటించిన సినిమా 'అసుర సంహారం'. ఈ సినిమా టీజర్ ను ఇటీవల ఆయన ఆవిష్కరించారు. మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది.
ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'అసుర సంహారం’. సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా జరిగింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన విలేజ్ క్రైమ్ డ్రామాగా 'అసుర సంహారం' మూవీని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ, 'అసుర సంహారం' అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఇందులో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్రను పోషించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో ఎన్.ఆర్.ఐ. శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు' అని చెప్పారు.
దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, 'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. నటి, సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా మాట్లాడుతూ, 'నేను గతంలో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి' అని కోరారు.