‘నాటకం’ కాంబోలో మరో సినిమా.. 20న ‘డానీ’గా వస్తున్న ఆశిష్ గాంధీ!

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:14 PM

ఆశిష్ గాంధీ హీరోగా నటించిన ‘డానీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాను కల్ట్ అండ్ వైల్డ్ డ్రామాగా అభివర్ణించారు.

Danny

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరో తెలుగు సినిమా సిద్ధమవుతోంది. అదే ‘డానీ’ (Danny). ఆశిష్ గాంధీ (ashish gandhi), సేజల్ గుప్తా (SejalGupta) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.

రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహించారు. గోవా నేపథ్యంలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన ప్రేమకథతో కూడిన రస్టిక్ డ్రామాగా రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ, నిర్మాత రిజ్వాన్‌లతో గతంలో ‘నాటకం’ సినిమా చేసిన అనుభవం ఉందని, ఇప్పుడు మరోసారి ‘డానీ’ కోసం కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఒక కల్ట్ అండ్ వైల్డ్ డ్రామాగా ఉంటుందని చెప్పారు. రాకేందు మౌళి రాసిన పాటలు, సాయి కార్తీక్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. సినిమాకు ఆనంద్ అందించిన విజువల్స్ కూడా బాగుంటాయని ప్రశంసించారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమ సినిమాను ఆదరించాలని కోరారు.

దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ.. ఆశిష్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, అతను నటిస్తుంటే దర్శకుడిగా మరింత నమ్మకంతో పనిచేయగలుగుతానని చెప్పారు. నిర్మాత రిజ్వాన్‌తోనూ మంచి అనుబంధం ఉందన్నారు. కథకు తగిన నిర్మాత దొరకడం ఈ సినిమాకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. చివరి దశలో సేజల్‌ను కథానాయికగా ఎంపిక చేశామని, రాకేందు మౌళి, ఆనంద్ తమ పనితో సినిమాకు బలాన్ని చేకూర్చారని తెలిపారు. నవంబర్ 20న సినిమాను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులను కోరారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘నాటకం’ తర్వాత ఇదే బృందంతో మరోసారి సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. గోవాలో ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తి చేశామని, ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందిందనే నమ్మకం ఉందని చెప్పారు. మీడియా సహకారం అందించాలని కోరారు.

పాటల రచయిత రాకేందు మౌళి మాట్లాడుతూ.. ‘డానీ’ టైటిల్ సాంగ్‌తో పాటు సినిమాలోని పాటలు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. తొలిసారిగా ఓ పాటకు ఆంగ్లంలోనూ సాహిత్యం రాసినట్లు వెల్లడించారు. ప్రేమలోని విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబించేలా పాటలను రూపొందించే అవకాశం వచ్చిందన్నారు. సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించారని, దర్శకుడు కళ్యాణ్‌తో కలిసి పనిచేయడం ఇది ఆరోసారి అని చెప్పారు. సినిమాలోని డానీ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని అభిప్రాయపడ్డారు.

సినిమాటోగ్రాఫర్ ఏకే ఆనంద్ మాట్లాడుతూ.. ‘డానీ’ చిత్రీకరణలో ప్రతి ఒక్కరి సహకారం లభించిందని, అందరి సమష్టి కృషితో మంచి విజువల్స్ అందించగలిగానని తెలిపారు.కే మ్యూజిక్ ప్రతినిధి ప్రియాంక మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలను తమ సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. నవంబర్ 20న ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు.

హీరోయిన్ సేజల్ గుప్తా మాట్లాడుతూ.. ‘డానీ’లో భాగం కావడం సంతోషంగా ఉందని, హీరో ఆశిష్‌తో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్‌జీకి కృతజ్ఞతలు తెలిపారు. నటుడు అజర్ ఖాన్ సైతం తనకు అవకాశం కల్పించిన దర్శకుడికి, ప్రోత్సహించిన ఆశిష్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు.

మొత్తానికి కొత్త తరహా ప్రేమకథ, రస్టిక్ నేపథ్యం, విభిన్నమైన సంగీతంతో ‘డానీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 02 , 2026 | 06:14 PM