Box Office War: యాక్షన్ కింగ్ వర్సెస్ మాస్ కా దాస్...

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:15 PM

యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసిన 'సీతాపయనం' మూవీ ఫిబ్రవరి 14న విడుదల కాబోతుండగా, దానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ వస్తోంది.

Arjun Vs Vishwaksen

యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun), హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కు మధ్య కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన వాదోపవాదాలను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. విశ్వక్ సేన్ హీరోగా, తన కుమార్తె ఐశ్వర్య (Aishwarya) హీరోయిన్ గా అప్పట్లో అర్జున్ తన దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. అందరూ ఈ కాంబినేషన్ కు ఫిదా అయిపోయారు. విశ్వక్ సేన్ మంచి ఫామ్ లో ఉండటం, క్యూట్ బ్యూటీ ఐశ్వర్య అతని జోడీగా నటిస్తుండటంతో ఇది తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెర వెనుక ఏం జరిగిందో కానీ ఆ ప్రాజెక్ట్ నుండి విశ్వక్ సేన్ తప్పుకోవాల్సి వచ్చింది. అతనికి వృత్తి పట్ల నిబద్ధత లేదని, సీనియర్ ఆర్టిస్ట్ అయినా తనను కూడా లెక్కచేయకుండా యాటిట్యూడ్ ప్రదర్శించాడని ఆ తర్వాత అర్జున్ ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఆ సమయంలో మౌనం వహించిన విశ్వస్ సేన్ ఆ తర్వాత ఎందుకు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.


ఇదలా ఉంటే అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయాలనే ఆలోచనకు ఫుల్ స్టాప్ మాత్రం పెట్టలేదు. కాస్తంత గ్యాప్ తీసుకుని నిరంజన్ సోధి హీరోగా 'సీతాపయనం' (Sitha Payanam) పేరుతో ఆ సినిమాను తిరిగి మొదలు పెట్టాడు. ఇందులో ధృవ్ సర్జా, సత్యరాజ్, ప్రకాశ్‌ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. అయితే... ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. గతంలో అర్జున్ మూవీ నుండి బయటకు వెళ్ళిపోయిన విశ్వక్ సేన్ నటించిన 'ఫంకీ' (Funky) మూవీ దీనికి ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 13న విడుదల కాబోతోంది. అంటే అర్జున్ డైరెక్షన్ చేసిన 'సీతాపయనం', అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'ఫంకీ' బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయన్న మాట. సో... ఈ రెండు సినిమాలలో దేనిది పై చేయి అవుతుందో చూడాలి.

Updated Date - Jan 08 , 2026 | 03:24 PM