Apfdc: ఏపీ నంది అవార్డులపై కీలక చర్చ.. త్వరలో విధివిధానాల ప్రకటన?
ABN , Publish Date - Jun 16 , 2026 | 09:32 PM
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సమావేశంలో నంది అవార్డులపై కీలక చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ఏపీ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (AP Film Development Corporation) రూపొందిస్తోందని సంస్థ ఎండీ విశ్వనాథన్ (Vishwanathan) తెలిపారు. కార్పొరేషన్ పాలకమండలి సమావేశం సోమవారం విజయవాడలో చైర్మన్ భరత్ భూషణ్ (Bharat Bhushan) అధ్యక్షతన జరిగింది.
రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై పాలక మండలి చర్చించింది. సినిమా, టీవీ, నాటక రంగాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు.
గతంలో ప్రకటించిన నంది అవార్డులు (Nandi Awards), భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవం, విధి విధానాలు, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఎండీ విశ్వనాథన్ తెలిపారు. ఉపాధ్యక్షుడు మెహర్ రమేశ్, డైరెక్టర్లు వై. ఝాన్సీ, సుమన్, శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్ పాల్గొన్నారు.