ఆ APFDC ప్రకటనతో నాకు సంబంధం లేదు: కె.ఎల్.దామోదర్ ప్రసాద్
ABN , Publish Date - May 14 , 2026 | 08:15 PM
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భరత్ భూషణ్ ను నియమించిన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నియామకాలకు సంబంధించి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎ్‌ఫపీసీ) పేరుతో ఇద్దరు సెక్రటరీలు, అధ్యక్షుడి సంతకాలతో ఇటీవల మీడియాకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు కె.ఎల్.దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సదరు ప్రెస్‌నోట్‌పై నేను సంతకం చేయలేదు. అలాగే అది విడుదల కావడానికి ముందు నాకు ఎలాంటి సమాచారం లేదు. ఆ ప్రకటనలోని అంశాలు గానీ, దాని విడుదలలో గానీ నాకు ఎలాంటి ప్రమేయం లేదు. కౌన్సిల్/ఛాంబర్ సంప్రదాయం ప్రకారం ఇలాంటి అధికారిక ప్రకటనలు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాతనే విడుదల చేయాలి. అధ్యక్షుడి అనుమతి లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడటం సంస్థాగత నిబంధనలు, సామూహిక బాధ్యతను ఉల్లఘించడమే అవుతుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జరీ చేస్తారా?: రవికిశోర్
అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇటువంటి ప్రకటన విడుదల చేయడం తీవ్రమైన నేరమనీ, దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్మాతలమండలి సభ్యుడు పి.వి. రవికిశోర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వహక కమిటీ కాలపరిమితి ముగిసి 14 నెలలు అయిందనీ, ఈ కమిటిని వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.