Pawan Kalyan: వారాహి దీక్షలో పవన్.. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:55 AM
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి దీక్ష చేపట్టారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి దీక్ష (Varahi Deeksha 2026) చేపట్టారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri)లోని మంగళాద్రి శ్రీలక్ష్మీనృ సింహస్వామి (Sri Lakshmi Narasimha Swamy) వారిని ఆయన దర్శించుకున్నారు. నృసింహా ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేయించిన అనంతరం పవన్ కల్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. ఆయన ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఆయన ఈ దీక్షను క్రమం తప్పకుండా యేటా స్వీకరిస్తున్నారు.
దీక్షా కాలంలో నియమితమైన జీవనంతో పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను ధరిస్తుంటారు. పవన్ కల్యాణ్ తొలుత లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాద లతో ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దిగువ సన్ని ధిలో రామవరప్పాడు మాజీ సర్పంచ్ వర్రి శ్రీదేవి మనవరాలు జువిష్యకు పవన్. అన్నప్రాసన చేశారు. అనంతరం ఎగువ సన్నిధిలో శ్రీ పానకాలస్వామిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.