Pawan Kalyan: ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్! కానీ..
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:22 AM
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన నాలుగు రోజులుగా ముంబై ఆస్పత్రిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ముంబాయి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు.
ఈ నెల 10న ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ (Kokilaben Hospital) ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. ఆయనవెంట సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు ఉన్నారు.
వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయంలో ఆయనకు ప్రతిరోజూ భుజానికి ఫిజియోథెరపీ నిర్వహించనున్నారు. శస్త్రచికిత్స చేసిన భుజం పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణ కొనసాగనుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మరో రెండు నెలల వ్యవధిలో ఎడమ భుజానికీ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి చికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ తన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంది.