'ఉస్తాద్' ప్రీమియర్ల పరిస్థితేంటి! ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా?
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:17 AM
పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే థియేటర్ల వద్ద పూనకాలు మొదలవుతాయి. గతేడాది ఓ.జి.తో రికార్డుల వేట మొదలుపెట్టిన పవన్, ఈ ఏడాది అంతకు మించి థ్రిల్ ఇవ్వడానికి సిద్ధమవు తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరు వింటేనే థియేటర్ల వద్ద పూనకాలు మొదలవుతాయి. గతేడాది ఓ.జి.తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టిన పవన్, ఈ ఏడాది అంతకు మించి థ్రిల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఇప్పుడు అంతటా ఒకటే చర్చ నడుస్తోంది. అదే ఉస్తాద్ ప్రీమియర్ల పరిస్థితి ఏంటి? అసలు టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా? లేదా అని.
నిజానికి ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మార్చి 26కి డేట్ లాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని ఉస్తాద్ టీమ్ ప్లాన్ మార్చింది. దీనివల్ల మార్చి 19నే 'ద రివేంజ్ ధురంధర్'కు పోటీగా ఉస్తాద్ భగత్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు. ఈ పోటీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా రేంజ్‌ను బట్టి టికెట్ ధరలు పెంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లభించే సూచనలు ఉన్నప్పటికీ, అక్కడ కేవలం ఒక వారం రోజులు మాత్రమే ధరలు పెంచుకునే అవకాశం ఉందని సమాచారం. కానీ తెలంగాణలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల టికెట్ రేట్ల వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. దీనిపై స్పందించిన కోర్టు, ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.
కోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఒక కఠినమైన రూల్‌ను తెరపైకి తెచ్చింది. ఏదైనా సినిమాకు టికెట్ రేట్లు పెంచాలన్నా, లేదా స్పెషల్ ప్రీమియర్ షోస్ వేయాలన్నా.. కనీసం 90 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ సినిమా అంటే తెల్లవారుఝాము నుంచే థియేటర్ల వద్ద సంబరాలు మొదలవ్వాలి. కానీ ఈ కొత్త నిబంధనల వల్ల తెలంగాణలో ప్రీమియర్ షోస్ పడటం దాదాపు అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే నైజాం ఏరియాలోని పవన్ ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ డైలాగ్స్, హరీష్ శంకర్ టేకింగ్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టికెట్ ధరలు, ప్రీమియర్ల విషయంలో చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరుగుతాయేమో వేచి చూడాలి. గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ను ఈ ఉస్తాద్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.