నవలా చిత్రం 'సెక్రటరీ'కి 50 ఏళ్ళు పూర్తి

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:26 PM

నటసమ్రాట్ ఏయన్నార్, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా రూపొందిన నవలా చిత్రాల 'సెక్రటరీ'. ఈ సినిమా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.

నటసమ్రాట్ ఏయన్నార్(ANR), కళాభినేత్రి వాణిశ్రీ (Vanisri)జంటగా రూపొందిన నవలా చిత్రాల 'సెక్రటరీ'. ఈ సినిమా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.

ఏయన్నార్ - వాణిశ్రీ జోడీ !


అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా డి.రామానాయుడు తమ సురేశ్ మూవీస్ బ్యానర్ పై 1971లో నవలా చిత్రం'ప్రేమనగర్'  నిర్మించారు... 'ప్రేమనగర్' బంపర్ హిట్ అయింది... ఈ చిత్రానికి కె.యస్.ప్రకాశరావు దర్శకత్వం వహించారు... ఆ తరువాత తమిళ, హిందీ భాషల్లోనూ ఆయన డైరెక్షన్ లోనే 'ప్రేమనగర్' కథ తెరకెక్కి సురేశ్ సంస్థకు ఘనవిజయం అందించింది... ఈ నేపథ్యంలో ఏయన్నార్ తో సురేశ్ మూవీస్ నిర్మించిన తరువాతి చిత్రం 'సెక్రటరీ'... ఇందులోనూ వాణిశ్రీ నాయిక - కె.యస్.ప్రకాశరావు దర్శకుడు... ఇది కూడా నవలా చిత్రమే కావడం విశేషం... యద్దనపూడి సులోచనారాణి రాసిన 'సెక్రటరీ' ఆధారంగా అదే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కింది... 1976 ఏప్రిల్ 28వ తేదీన 'సెక్రటరీ' జనం ముందు నిలచింది... పాఠకులను విశేషంగా అలరించిన 'సెక్రటరీ' కథ, సినీ ఫ్యాన్స్ ను సైతం అదే తీరున మురిపించింది... ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు- పాటలు రాశారు... కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు...

'అన్నపూర్ణ'లో తొలి చిత్రం...

'అందాల రాముడు' షూటింగ్ 1973లో గోదావరి నదీ పరిసరాల్లో జరిగింది... ఆ మూవీ షూటింగ్ లో ఏయన్నార్ నదిలో ఈత కొట్టే సీన్ లో నటించారు... ఆయాసం తీవ్రంగా రావడంతో చెక్ చేయించుకున్నారు... హార్ట్ ప్రాబ్లెమ్ అని తేలింది.. ఆ పై అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి అమెరికాలో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు... విశ్రాంతి తీసుకోవడం వల్ల ఓ యేడాది సినిమాల్లో నటించలేదు ఏయన్నార్... అలా 1975వ సంవత్సరంలో ఏయన్నార్ నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు... ఆ సమయంలోనే అన్నపూర్ణ సినీస్టూడియోస్ నిర్మాణం కూడా సాగింది... అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా 'సెక్రటరీ' నిలచింది. 1976లో ఏయన్నార్ 'మహాకవి క్షేత్రయ్య' ముందుగా రిలీజయింది. ఆ సినిమా అంతగా అలరించలేదు. దాంతో ఏయన్నార్ ఫ్యాన్స్ అందరూ 'సెక్రటరీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. పైగా 'ప్రేమనగర్' కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడంతో 'సెక్రటరీ'పై బజ్ బాగానే క్రియేట్ అయింది. 'సెక్రటరీ'ని చదివిన పాఠకులు సైతం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రంలో నటీనటుల పేర్లకు బదులు వారి ఫోటోల కింద పాత్రల పేర్లు రాసి టైటిల్స్ వేయడం విశేషం...

స్పెషల్ అట్రాక్షన్... క్రికెట్ మ్యాచ్...
'సెక్రటరీ' మూవీ మంచి ఆదరణ పొందింది. శతదినోత్సవం జరుపుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందిన మొదటి సినిమా కావడంతో ఏయన్నార్ ఫ్యాన్స్ 'సెక్రటరీ' రిలీజ్ కు హంగామా చేశారు. ఇదే సమయంలో ఓ సంక్షేమ నిధి కోసం ఉత్తర, దక్షిణ ప్రముఖ నటవర్గం మధ్య లాల్ బహదూర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో సౌత్ స్టార్స్ క్రికెట్ టీమ్ కు యన్టీఆర్ కెప్టెన్ గా వ్యవహరించారు. నార్త్ స్టార్స్ క్రికెట్ టీమ్ కు దిలీప్ కుమార్ కెప్టెన్. ఈ మ్యాచ్ అప్పట్లో సరదాగా సాగింది... ప్రేక్షకులను ఎంతగానో అలరించింది... ఆ మ్యాచ్ ను థియేటర్స్ లో ప్రదర్శించే రైట్స్ ను సురేశ్ అధినేత డి.రామానాయుడు సొంతం చేసుకున్నారు. 'సెక్రటరీ' ఆడుతున్న థియేటర్స్ లో ఈ క్రికెట్ మ్యాచ్ షార్ట్ మూవీగా ప్రదర్శించారు. దాంతో  'సెక్రటరీ' మూవీ ఆడే థియేటర్లకు జనం విశేషంగా వెళ్ళి వీక్షించారు... ఆ తీరున కూడా 'సెక్రటరీ' ఆదరణ చూరగొంది... ఏది ఏమైనా ఏయన్నార్ నవలా చిత్రాల్లో ఒకటిగా 'సెక్రటరీ' నిలచింది... 

Updated Date - Apr 28 , 2026 | 04:27 PM