'భోగి' నుంచి మరో అదిరిపోయే సాంగ్.. 'అన్నయ్య పాణంలో పూసిన పువ్వులు'
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:51 PM
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి జంటగా సంత్ నంది దర్శకత్వంలో ఓ యధార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం భోగి.
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయతి (Dimple Hayathi) జంటగా సంత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన యధార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం భోగి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించగా ఇటీవల విడుదల చేసిన తొలి పాట అంచనాలను మించి ప్రజాదరణను దక్కించుకుని సినిమాపై మంచి హైప్ తీసుకు వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడ కేంద్రంగా నిర్వహించిన దసరా ఉత్సవ్‌లో ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. అన్నయ్య పాణంలో పూసిన పువ్వులు (Annayya Paanam Lo Poosina Puvvulu) అంటూ సాగే ఔట్ అండ్ ఔట్ సెంటిమెంటల్ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు అస్కార్ విన్నర్ చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించగా భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతంలో శ్రీ కృష్ణ (Sri Krishna) ఆలపించాడు.
మొదటి గీతంలానే ఈ పాట కూడా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగింది. అన్న ఐదుగురు చెల్లెల నడుమ ఉన్న బంధాన్ని హృద్యంగా తెరకెక్కించినట్లు ఈ పాట చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్లర్ సినిమాలోని అన్నా చెల్లెల రిలేషన్‌ను గుర్తుకు తెస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎప్పుడు మాటల రూపంలో వినిపించే తెలంగాణ యాసను ఈ మారు పాటలోను ప్రయత్నించడం విశేషం.