అనిరుధ్‌ మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌.. గచ్చిబౌలి రోడ్డుపై వాహ‌న‌దారుల న‌ర‌కం

ABN , Publish Date - Mar 22 , 2026 | 10:04 AM

శ‌నివారం సాయంత్రం అనిరుధ్ రవిచందర్ సంగీత కచేరి సంగీత ప్రియులను అలరిస్తే. రహదారులపై ట్రాఫిక్... వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

Anirudh Ravichander

సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత కచేరి (Music Concert) సంగీత ప్రియులను అలరిస్తే. రహదారులపై ట్రాఫిక్ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే శనివారం సాయంత్రం ట్రాఫిక్ మళ్లింపులో ప్రణాళికా లోపం కారణంగా 5 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి 40 నిమిషాలు పట్టింది. గచ్చిబౌలి హెచ్.సి.యు. నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వరకు చేపట్టిన ట్రాఫిక్ మళ్ళింపు చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది.

ముందస్తు సన్నాహాలు చేసినా..

ఈ సంగీత కచేరి నిర్వహణపై సైబరాబాద్ ట్రాఫిక్ (Cyberabad Traffic Police) డీసీపీ-1 శుక్రవారం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామని ముందుగానే ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది విఫలమయ్యారని వాహనదారులు మండిపడ్డారు.

గచ్చిబౌలి స్టేడియం వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రిపుల్ ఐటీ సర్కిల్ వద్ద గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్లే వాహనాలను నిలిపివేసి విప్రో సర్కిల్ వైపు గానీ, బొటానికల్ గార్డెన్ వైపు గానీ దారి మళ్లిస్తే వాహన దారులకు ఇబ్బంది లేకుండా ఉండేది. గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలను సిగ్నల్ వద్ద యూ టర్న్ చేసేలా దారి మళ్లించారు. విప్రో సర్కిల్ నుంచి ట్రిపుల్ ఐటీ సర్కిల్ మీదుగా గచ్చి బౌలి, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలను అనుమతించకుండా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమి వద్ద సిగ్నల్ నుంచి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ రోడ్డులోకి దారి మళ్లించారు.

Anirudh Ravichander

దీంతో ఐఎ నాబీ, విప్రో సర్కిల్ వైపు నుంచి ట్రిపుల్ ఐటీ సర్కిల్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు శాంతి సరోవర్, జీపీఆర్ఎ క్వార్టర్స్ మీదుగా చుట్టూ తిరిగి మళ్లీ ట్రిపుల్ ఐటీ సర్కిల్ వద్దకు వచ్చి యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పుల్లెల గోపీచంద్ అకాడమి నుంచి ట్రిపుల్ ఐటీ సర్కిల్ కు 5 నిమిషాల్లో చేరుకోవాల్సిన దారిని 3 కిలోమీటర్లు తిప్పించి మళ్లీ ట్రిపుల్ ఐటీ సర్కిల్ వద్దకు వచ్చే విధంగా దారి మళ్లించడంలో అర్ధం ఏముందని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

స్టేడియంలో సంగీత కచేరి నిర్వహణపై అభ్యంతరాలు

క్రీడా కార్యకలాపాల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిసినా అనుమతులు ఇవ్వడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సంగీతాభిమానులు వచ్చినట్లు సమాచారం. భారీ మొత్తంలో వచ్చే వాహనాలకు ఇక్కడ సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోయినా కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సంగీత కచేరి నిర్వహించడం వల్లే ట్రాఫిక్ సమస్యకు కారణమైందని పలువురు వాహనదారులు వాపోయారు.

Updated Date - Mar 22 , 2026 | 08:11 PM