అటు ప్రభాస్ ఇటు వంగా మధ్యలో రణ్‌బీర్! ఎంత పని చేశావ్.. రామా!
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:06 PM
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ విడుదల తేదీ మార్పు వెనుక రణ్‌బీర్ కపూర్ సూచన ఉందనే ప్రచారం నడుస్తోంది.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యానిమల్ సినిమా తరువాత చాలా మంది ఇదే రూట్‌ను ఫాలో అయి సక్సెస్ కొట్టిన హీరోలు కూడా ఉన్నారు. కానీ యానిమల్ది మాత్రం సపరేట్ ట్రాకే. యానిమల్ సినిమాతో రణ్‌బీర్ కపూర్‌కు, సందీప్ రెడ్డి వంగాకు మద్య బాండింగ్ మరింత బలపడింది. భవిష్యత్తులో యానిమల్ పార్క్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలపబోతున్నారు. అయితే ఇప్పుడు వీరి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యమే ప్రభాస్ (Prabhas) రాబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కు ఒక అనూహ్యమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అసలు రణ్‌బీర్ కపూర్‌కి, ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వెనుక ఎందుకు తెరపైకి వచ్చారు..? తెరవెనుక నడిచిన ఆ ప్లాన్ ఏంటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ పై భారతీయ చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని తొలుత 2027 మార్చి 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి మూవీ విడుదల తేదీని అక్టోబర్ 29, 2027కి రీ-షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి నుంచి నేరుగా అక్టోబర్‌కు.. అంటే ఏకంగా ఏడు నెలల పాటు వాయిదా వేయడానికి కేవలం షూటింగ్ ఆలస్యం మాత్రమే కారణం కాదు, దీని వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో ఊపందుకుంది.
ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న విజువల్ వండర్ రామాయణ పార్ట్ 2 మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం కాస్త కష్టమేనట. ఈ చిత్రానికి సంబంధించిన భారీ వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రణ్‌బీర్, తన అత్యంత సన్నిహిత మిత్రుడు సందీప్ రెడ్డి వంగాతో షేర్ చేసుకున్నట్లు సమాచారం. ‘రామాయణ 2’ బరిలో లేకపోతే 2027 దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పూర్తిగా ఖాళీగా ఉంటుందని, ఆ సమయం ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు పర్ఫెక్ట్ విండో అవుతుందని రణ్‌బీర్ సూచించినట్లు ఇండస్ట్రీ టాక్.
ఈ సమాచారం అందిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో పాటు నిర్మాత భూషణ్ కుమార్ అప్రమత్తమయ్యారు. ఒక పాన్ ఇండియా చిత్రానికి లాంగ్ రన్, బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టే సత్తా ఉండేది పండగ సీజన్లలోనే. దసరా-దీపావళి పండగ సెలవుల కలిసివచ్చే అక్టోబర్ చివర వస్తే, అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ తిరుగులేని కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దీనికితోడు ఎలాంటి పెద్ద సినిమాల పోటీ లేకపోవడం మరింత ప్లస్ పాయింట్. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే స్పిరిట్ ను అక్టోబర్ 29, 2027కి లాక్ చేశారు. ఇలా హీరో-డైరెక్టర్ మధ్య ఉన్న స్నేహం, పరస్పర అవగాహన స్పిరిట్ సినిమాకు ఒక అదిరిపోయే సోలో ఫెస్టివల్ రిలీజ్ విండోను అందించింది. అక్టోబర్ 2027లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా జోడీ పక్కా స్కెచ్‌తో రెడీ అవుతోంది. మరి రణ్‌బీర్ ఇచ్చిన ఈ సమాచారంతో ఖరారైన ‘స్పిరిట్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.