Anil Sunkara: అంతా కొత్త వారితో అనిల్ సుంకర ప్రయోగం.. వినూత్నంగా ప్రమోషన్స్
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:55 PM
ఇటీవల నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.
కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా, కొత్త ఆలోచనలతో సినిమాలు రూపొందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నిర్మాత, ఇటీవల నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనిల్ సుంకర (Anil Sunkara) మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’ ఇప్పటికే సినీ వర్గాలతో పాటు క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. టాలెంట్ ఉన్న కొత్తవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్‌కి మంచి స్పందన లభిస్తోంది
ఇప్పుడు ప్రాజెక్ట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, ATV Originals బ్యానర్‌పై కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఫీచర్ ఫిల్మ్ ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ (AIRFORCE – Bezawada Batch) ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం, నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించనుంది. కలలు, సవాళ్లు, స్నేహబంధం, కష్టాల మధ్య తమ లక్ష్యాన్ని సాధించేందుకు వారు చేసే పోరాటమే ఈ కథ ప్రధాన ఇతివృత్తం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు విజయం సాధించే వారి ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.

అయితే.. ఈ నేపథ్యంలో సినిమా ప్రయాణానికి శుభారంభం పలుకుతూ, మేకర్స్ తొలి నటుడిని ట్రెండ్‌కు తగ్గట్టుగా వినూత్నంగా ప్రకటించి ఆశర్య పరిచారు. ఈక్రమంలో విజయవాడలోని ప్రముఖ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “అమెరికా వెళ్లి బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా అని చెప్పే స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు” అంటూ సరదా వ్యాఖ్యలతో రూపొందిన ఈ బ్యానర్, సినిమా కథను చెప్పకనే చెప్పేలా ఉంది. బెజవాడ స్టైల్ వెటకారం, మిత్రుల మధ్య ఫ్రెండ్‌షిప్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు తెలియ జేయనున్నారు.