Tollywood: అనిల్ రావిపూడి.. వరుసగా తొమ్మిదో విజయం
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:31 PM
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయాణం అప్రతిహతంగా సాగిపోతోంది. అతని తొమ్మిదో చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు' సైతం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సంక్రాంతి సీజన్ లోనే కాదు... ఈ యేడాదిలో ఫస్ట్ సక్సెస్ ను పొందిన సినిమాగా ఇది నిలిచింది.
ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సక్సెస్ కొట్టేశారు. దాంతో అనిల్ కెరీర్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ వచ్చేసిందని ట్రేడ్ టాక్. అంటే వరుసగా తొమ్మిది హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారన్న మాట.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పటి దాకా ఫెయిల్యూర్ ఎరుగకుండా సాగుతున్నారని టాలీవుడ్ (Tollywood) ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. తాజాగా అనిల్ దర్శకత్వంలో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Sankara Varaprasad Garu) కూడా గుడ్ టాక్ సంపాదించడంతో హిట్ గ్యారంటీ అని చెబుతున్నారు. దీంతో వరుసగా తొమ్మిది సినిమాల ఘనవిజయాన్ని తన కిట్ లో వేసుకున్నారు అనిల్. తొలి సినిమా 'పటాస్' మొదలు ఈ నాటి 'పటాస్' (Patas) దాకా అనిల్ కెరీర్ లో ఒక్క పరాజయం కూడా లేకపోవడం గమనార్హమని అంటున్నారు. 'పటాస్, సుప్రీమ్, రాజా ద గ్రేట్' (Raja The Great) మూవీస్ తో తొలి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు అనిల్. 'ఎఫ్-2 (F-2), సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-3 (F-3)' చిత్రాలతోనూ అనిల్ మరో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 'భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం' తోనూ వరుస విజయాలు చూసిన అనిల్ తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'తో కూడా ఇంకో హ్యాట్రిక్ చూశారని ట్రేడ్ టాక్. ఇలా ట్రిపుల్ హ్యాట్రిక్ తో సాగుతోన్న అనిల్ పై తెలుగు చిత్రసీమ అభినందన జల్లులు కురిపిస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వాన్ని పరిశీలిస్తే ఎలాంటి సబ్జెక్ట్ నైనా కామెడీతో రంగరించి, జనాన్ని కట్టిపడేస్తారని చెప్పొచ్చు. తొలి సినిమా 'పటాస్' నుండీ అదే తీరున సాగుతున్నారు అనిల్. తాజాగా జనం ముందు నిలచిన 'మన శంకరవరప్రసాద్ గారు'లోనూ అదే రీతిన సాగారు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను రూపొందించుకున్నారు. ఆయనను వింటేజ్ లుక్ లో చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక విక్టరీ వెంకటేశ్ ను ఈ మూవీలో కీలక పాత్రలో ప్రవేశ పెట్టి మరింతగా మురిపించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే ఈ నాటికీ ముందుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున గుర్తుకు వస్తారు. వీరిలో తొలిసారి చిరంజీవి-వెంకటేశ్ కాంబోలో సినిమా తీసిన క్రెడిట్ ను కూడా అనిల్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు- నవతరం నాయకులనే కాదు ఆ తరం హీరోలను సైతం హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నారు అనిల్.
అనిల్ రావిపూడి వరుసగా తొమ్మిది విజయాలు చూడడమే కాదు. వాటిలో నాలుగు సినిమాలతో పొంగల్ బరిలోనూ తడాఖా చూపించడం విశేషం. తొలిసారి 2019 సంక్రాంతికి 'ఎఫ్-2'తో సందడి చేసి విజయాన్ని మూటకట్టుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే 2020లో 'సరిలేరు నీకెవ్వరు'తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు వరుసగా పొంగల్ మూవీస్ తో విజయాలను చూడడం విశేషంగా మారింది. గత సంవత్సరం సంక్రాంతి రేసులో అనిల్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' నంబర్ వన్ గా నిలచింది. వెంటనే ఈ సంవత్సరం పొంగల్ బరిలోనూ 'మన శంకరవరప్రసాద్ గారు'తో మరో హిట్ ను అందుకోవడమూ విశేషంగా మారింది. దాంతో మరి అనిల్ తరువాతి సినిమా ఏ స్టార్ తో ఉంటుందనే చర్చ మొదలయింది. అంతే కాదు ఆ నాటి టాలీవుడ్ టాప్ హీరోస్ ముగ్గురితో సినిమాలు తీసిన అనిల్ ఒకే ఒక్క నాగార్జునతో మూవీ చేస్తే సరిపోతుందనీ అంటున్నారు. మరి రాబోయే అనిల్ రావిపూడి మూవీ ఎలాంటి విశేషాలకు చోటిస్తుందో చూడాలి.